ఈ ఏడాదీ వి‘పత్తే’
చేలోనే రాలుతున్న తెల్లబంగారం
పత్తితీతకు కూలీల కొరత
పొరుగు రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్న రైతులు
డిమాండ్‌తో పాటే పెరిగిన కూలి ధరలు
ఇతర రాష్ట్రాల కూలీలపై ఆధారం..
బూర్గంపాడు: పత్తి రైతులను ఈ ఏడాది వరుస కష్టాలు వీడటం లేదు. యూరియా కొరత, అధిక వర్షాలు వంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్న రైతులను.. ప్రస్తుతం కూలీల కొరత వేధిస్తోంది. పత్తితీతకు కూలీలు దొరకక చేలోనే నేలరాలుతోంది. కొందరు రైతులు పొరుగు రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొస్తుండగా, కొరత నేపథ్యంలో అధిక కూలి చెల్లించాల్సి వస్తోంది. ఇక తీసిన పత్తి విక్రయంలో కష్టాలు సరేసరి. తేమశాతం ఎక్కువగా ఉందని, నాణ్యత సరిగా లేదని సీసీఐ కొనుగోలు చేయడం లేదు. దీంతో ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. పత్తి అమ్మితే వచ్చిన డబ్బు కూలీలకు కూడా సరిపోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరుస వర్షాలతో ఆలస్యం..
జిల్లాలో ఈ ఏడాది 2.25 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. బూర్గంపాడు, జూలూరుపాడు, సుజాతనగర్, అశ్వాపురం, టేకులపల్లి, ఇల్లెందు, దుమ్ముగూడెం, చర్ల, ములకలపల్లి, గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంట సాగైంది. వరుసగా మూడు నెలలపాటు కురిసిన వర్షాలతో పత్తితీతలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఇటీవల మొదలుపెట్టినా.. మళ్లీ వానలు పడుతుండడంతో మరింత జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం పత్తి చేలు బాగా పూసి ఉన్నాయి. అయితే వర్షాలతో కాయలు నల్లబడడం, కుళ్లడం, దూది సాగి నేలరాలడంతో పత్తితీతకు సమయం ఎక్కువగా పడుతోంది. గతేడాది కిలోకు రూ.12 చొప్పున కూలీలకు చెల్లించేవారు. ఒక్కో మహిళ కూలీ రోజుకు 40 నుంచి 100 కిలోల వరకు పత్తి తీయగా.. రూ.500 నుంచి రూ.1,200 వరకు కూలి దక్కేది. అయితే ఈ ఏడాది పత్తి తీసేందుకు అనువుగా లేకపోవడంతో కూలీలు కిలోల లెక్కన కాకుండా రోజువారీ కూలి రూ.300 చొప్పున తీసుకుంటున్నారు. కానీ ఒక్కొక్కరు 10 నుంచి 20 కిలోల పత్తి మాత్రమే తీస్తున్నారు. తద్వారా క్వింటా పత్తి తీసేందుకు కూలీలకే సుమారు రూ. 3వేల వరకు ఖర్చవుతోంది. రవాణా ఖర్చులు మరో రూ. 500 అవుతుండగా ప్రైవేట్ వ్యాపారులు క్వింటా పత్తిని రూ.4వేల నుంచి రూ. 5వేల వరకే కొనుగోలు చేస్తున్నారు. కూలీలు, రవాణా ఖర్చులు పోతే రైతుకు క్వింటాకు రూ. 500 నుంచి రూ.1000 వరకే మిగులుతున్నాయి. ఇలా అయితే పెట్టుబడి ఖర్చులు ఎలా వస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పత్తి తీసేందుకు ఈ ఏడాది కూలీలు దొరకటం లేదు. వర్షాలతో పత్తితీతలు ఆలస్యమవుతున్నాయి. ఒక కూలీ రోజుకు 15 కిలోలు కూడా తీయట్లే. కిలో పత్తి తీసేందుకు రూ. 20 ఖర్చవుతోంది. కూలీలు దొరకక కొందరు రైతులు ఇతర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నారు. దీంతో కూలి ధరలు కూడా పెరిగాయి.
– యడమకంటి నర్సింహారెడ్డి, రెడ్డిపాలెం
పత్తి తీసేందుకు రైతులు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూలీలను రప్పిస్తున్నారు. ఏపీలోని మార్కాపురం, ఒంగోలు ప్రాంతాల నుంచి ఇప్పటికే కొన్ని మండలాలకు వలస కూలీలు వచ్చారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొస్తే రవాణా ఖర్చులు, వారికి స్థానికంగా వసతులు, నిత్యావసరాలు కూడా రైతులే సమకూర్చాల్సి వస్తోంది. చేలలో పత్తిని వదిలేయలేక రైతులు పక్క రాష్ట్రాల నుంచి కూలీలను ఎక్కువ కూలి చెల్లించి తీసుకొస్తున్నారు. అధిక వర్షాలతో దిగుబడి రాక, పత్తికి మద్దత ధర దక్కక, పెట్టుబడి, కూలీల ఖర్చులు పోతే ఈ ఏడాది కూడా నష్టాలే వస్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాదీ వి‘పత్తే’


