ఆరోగ్య సేవలపై సీఆర్‌ఎం సమీక్ష
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో అమలవుతున్న ఆరోగ్య సేవలపై సీఆర్‌ఎం(కామన్ రివ్యూ మిషన్) బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రితో పాటు రామవరం ఎంసీహెచ్, భద్రాచలం ఏరియా ఆస్పత్రి, చర్ల, ఇల్లెందు, గుండాల, సత్యనారాయణపురం, సుజాతనగర్ తదితర ఆస్పత్రులను ఇటీవల పరిశీలించిన బృందం సభ్యులు.. ఐడీఓసీలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సభ్యుడు డాక్టర్ గురీందర్ బీర్ సింగ్ మాట్లాడుతూ.. జిల్లాలో మాతా శిశు ఆరోగ్యం, వ్యాధి నియంత్రణ, గ్రామీణ ఆరోగ్య సేవల విస్తరణ, వైద్య సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. ఆరోగ్య సిబ్బంది నిబద్ధతతో పనిచేస్తున్నారని అన్నారు. సభ్యుల పరిశీలన వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వెల్లడించారు. వైద్య సిబ్బందికి తరచూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి, సేవల నాణ్యతను మరింతగా మెరుగుపరచాలని సూచించారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, ఎంఎల్‌హెచ్‌పీలు సమర్థవంతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. అనంతరం కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ సీఆర్‌ఎం బృందం చేసిన సూచనలను సత్వరమే అమలు చేయాలని, జిల్లాలో ఆరోగ్య సేవల నాణ్యతను మరింత బలోపేతం చేయడానికి అధికారులు కృషి చేయాలని సూచించారు. సిబ్బంది కృషితోనే ఆరోగ్య వ్యవస్థ పటిష్టంగా ముందుకు సాగుతుందని అన్నారు. సమావేశంలో సీఆర్‌ఎం సభ్యులు బి.వెంకటశివారెడ్డి, అజయ్‌పాండే, అంకిత కాంకర్య, అనర్‌సింగ్ డాకర్, కల్పనా భవానియా, ట్రెయినీ కలెక్టర్ సౌరభ్ శర్మ, డీఎంహెచ్‌ఓ ఎస్.జయలక్ష్మి, ఏడీఎంహెచ్‌ఓ సైదులు, డీసీహెచ్‌ఎస్ రవిబాబు, ప్రోగ్రాం అధికారులు మధువరన్, పుల్లారెడ్డి, స్పందన, తేజశ్రీ పాల్గొన్నారు.
అమలు తీరుపై
బృందం సభ్యుల సంతృప్తి


