విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
డీఈఓ నాగలక్ష్మి
పినపాక: పాఠశాలల్లో నాణ్యమైన విద్య, భోజనం అందించాలని డీఈఓ, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి ఉపాధ్యాయులకు సూచించారు. గురువారం ఆమె పినపాక మండలం పోతిరెడ్డిపల్లి, ఈ బయ్యారం పాఠశాలలను పరిశీలించి మాట్లాడారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ బయ్యారం ఉన్నత పాఠశాలలో శనివారం నుంచి నిర్వహించే క్రీడాపోటీల ఏర్పాట్లను పరిశీలించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని, క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అన్నారు. పంచాయతీలో ప్రతిరోజు పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎఫ్‌ఆర్‌ఓ తేజస్వి, ఎంపీడీఓ సంకీర్త్, ఎంపీఓ వెంకటేశ్వరరావు, ఎంఈఓ నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
విద్యాభివృద్ధికి కృషి చేయాలి
మణుగూరు రూరల్: విద్య, గ్రామీణాభివృద్ధికి అధికారులు నిబద్ధతతో పని చేయాలని నాగలక్ష్మి సూచించారు. మణుగూరు ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం నిర్వహించిన వీసీలో మాట్లాడారు. పలు అంశాలపై సమీక్షించి అధికారులతో చర్చించారు. అనంతరం మండల స్థాయి అధికారులు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు తమ పరిధిలో చేపట్టిన పనుల పురోగతి, ఎదురవుతున్న సవాళ్లను వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ టి శ్రీనివాసరావు, ఎంఈఓ స్వర్ణజ్యోతి తదితరులు పాల్గొన్నారు.


