ఆట, పాటల్లోనూ రాణించాలి
చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలూ అవసరమే ఎమ్మెల్యే కూనంనేని, అదనపు కలెక్టర్ విద్యాచందన జాతీయ యువజనోత్సవాలకు కళాకారుల ఎంపిక
కొత్తగూడెంటౌన్ : విద్యార్థులు చదువుతో పాటు ఆట, పాటల్లోనూ రాణించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. వచ్చే ఏడాది జనవరి 12 నుంచి 16 వరకు మణిపూర్‌లో జరిగే జాతీయ యువజోత్సవాలకు జిల్లాస్థాయి కళాకారుల ఎంపిక పోటీలను కొత్తగూడెం క్లబ్‌లో గురువారం నిర్వహించగా, అదనపు కలెక్టర్ విద్యాచందన, ఆర్డీఓ మధు, డీవైఎస్‌ఓ పరంధామరెడ్డితో కలిసి కూనంనేని జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. బాల్యం నుంచే చదువుతో పాటు కళలు, ఆటలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. పిల్లలకు ఇష్టమైన రంగంలో రాణించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కోరారు. ఆ తర్వాత జరిగిన పోటీల్లో విద్యార్థులు, యువత పాటలు, వక్తృత్వ, వ్యాసరచన, పెయింటింగ్, నృత్యాలు తదితర పోటీల్లో ప్రతిభ చాటారు. పోటీలకు 15 – 29 ఏళ్ల మధ్య యువతీ యువకులు సుమారు 600 మంది హాజరు కాగా, ప్రతిభ చాటిన వారిని పోటీలకు ఎంపిక చేశారు. సైన్స్ విభాగంలో ఆశ్వారావుపేటకు చెందిన ఎస్.లక్ష్మి నవ్యశ్రీ. ఎ.మహిత, ఇ.ఎస్తేర్‌రాణి రూపొందించిన పుట్టగొడుగుల సాగుకు సంబంధించిన ప్రాజెక్టు, మణుగురు ఐటీఐ విద్యార్థిని అడప శృతి డిజైన్ ఆఫ్ ఫ్రాబ్రికేషన్ ఆఫ్ ఎలక్రిక్ వెహికల్ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖకు చెందిన అధికారులు తిరుమలరావు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
జానపద నృత్యంలో ఆశ్వారావుపేట ఏకలవ్య మోడల్ స్కూల్, జానపద గేయాల్లో గుండాల ఏకలవ్య స్కూల్, కొత్తగూడేనికి చెందిన శ్రీజు గ్రూప్, సింగరేణి ఉమెన్స్ కాలేజీ నుంచి సఫియా గ్రూప్‌లు విజేతలుగా నిలిచాయి. సైన్స్ విభాగంలో ఆశ్వారావుపేట వ్యవసాయ కళాశాలకు చెందిన ఎ.మహిత, కె.రోహిత, ఎ.శృతి, పెయింటింగ్‌లో పాల్వంచ అనుబోస్ కాలేజీకి చెందిన ఎస్‌డీ జుబేదా, కొత్తగూడెం జేఆర్ కాలేజీ విద్యార్థి ఎండీ రియాజ్, భద్రాచలానికి చెందిన బి.దివ్య, వక్తృత్వ పోటీల్లో ఆశ్వారావుపేటకు చెందిన ఎం. సాయి నిఖిత, ఎం. శ్రీలక్ష్మి, నితేష్‌కుమార్, వ్యాసరచనలో దేవరాజు ఆఖిల, సీహెచ్ శ్యామల, డి.జ్యోతి, కవిత్వంలో కె. రుణ్‌తేజా, హిమాన్షుక విజేతలుగా నిలిచారు.
ఆట, పాటల్లోనూ రాణించాలి


