భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం పల్లకీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్య కల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. ఆ తర్వాత అర్చకులు నివేదన, హారతి సమర్పించి మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, పాలక మండలి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, అర్చకులు, వేదపడింతులు పద్మనాభశర్మ, రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉచిత వృత్తి శిక్షణ
భద్రాచలంటౌన్ : ఉమ్మడి జిల్లా పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉచిత వృత్తి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రెండు నెలల పాటు ఉచిత భోజన, వసతి కల్పిస్తూ డ్రోన్ సర్వీస్ టెక్నీషియన్‌గా శిక్షణ అందిస్తామని, ఆ తర్వాత ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వివరించారు. ఎస్సెస్సీ, డిగ్రీ, ఐటీఐ పూర్తి చేసిన 20 – 30 ఏళ్ల వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల నిరుద్యోగ గిరిజన యువత విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ జిరాక్స్ కాపీలతో ఈనెల 17వరకు ఐటీడీఏలోని భవిత సెల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
10న నేషనల్ అప్రెంటిస్ మేళా
మణుగూరు రూరల్: మణుగూరు ప్రభుత్వ ఐటీఐలో ఈ నెల 10వ తేదీన నేషనల్ అప్రెంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జి.రవి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు తప్పకుండా అప్రెంటిస్ చేయాలన్నారు. హైదరాబాద్‌లోని వివిధ కంపెనీల ప్రతినిధులు ఈ మేళాకు హాజరై ఐటీఐ పూర్తి చేసిన వారికి అవకాశం కల్పిస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు 99896 37594 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
15న ‘జనజాతి గౌరవ దివస్’
భద్రాచలంటౌన్ : ఆదివాసీ గిరిజన నాయకుడు బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని ఈనెల 15న జనజాతి గౌరవ దివస్‌ను ఘనంగా నిర్వహించేలా అధికారులు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని కేంద్ర గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ మహేష్ ఠాకూర్ ఆదేశించారు. బిర్సా ముండా జయంతి ఉత్సవాల నిర్వహణపై న్యూఢిల్లీ నుంచి గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా ఐటీడీఏ పీఓ బి.రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ ఠాకూర్ మాట్లాడుతూ.. అన్ని విద్యాసంస్థల్లో జయంతి వేడుకలు నిర్వహించాలని సూచించారు.
ఆయిల్‌పామ్ మొక్కల నాణ్యతపై విచారణ
దమ్మపేట: నాణ్యతలేని ఆయిల్‌పామ్ మొక్కల వ్యవహారంపై హైదరాబాద్‌లోని దిల్‌కుశ గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం ఎస్టీ కమిషన్ విచారించనుంది. బాధిత రైతుల ఫిర్యాదు మేరకు సంబంధిత ఉన్నతాధికారుల సమక్షంలో నాణ్యత లోపంపై విచారణ ఉంటేందని మండలంలోని జగ్గారం గ్రామానికి చెందిన ఫిర్యాదుదారుడు కారం శ్రీరాములు తెలిపారు. విచారణకు హాజరు కావాలని కోరుతూ తనకు ఎస్టీ కమి షన్ నుంచి నోటీస్ వచ్చిందని పేర్కొన్నారు.
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం


