నేడు విచారణకు తెల్లం | - | Sakshi
Sakshi News home page

నేడు విచారణకు తెల్లం

Nov 6 2025 8:16 AM | Updated on Nov 6 2025 8:16 AM

నేడు విచారణకు తెల్లం

నేడు విచారణకు తెల్లం

ఆ తర్వాత గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌ గూటికి..

తెల్లం వెంకట్రావును నేడు విచారించనున్న స్పీకర్‌

కాంగ్రెస్‌లో చేరిక..

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు రాజకీయ భవితవ్యం ఏ మలుపు తీసుకుంటుందనే చర్చ మళ్లీ మొదలైంది. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ఈ ఏడాది ఆగస్టు 23న నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించిన విచారణ నేడు జరగనుంది.

అనూహ్య గెలుపు..

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా ప్రస్థానం ప్రారంభించిన తెల్లం వెంకట్రావు 2014 నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 2014లో ఎంపీగా, 2019లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన ఆయన.. 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత జిల్లాలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల్లో పొంగులేటితో పాటు నడిచిన వెంకట్రావు బీఆర్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. అయితే, పొంగులేటితో పాటే కాంగ్రెస్‌లో చేరిన వెంకట్రావు సాధారణ ఎన్నికలు జరగడానికి రెండు నెలల ముందు నాటకీయంగా తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఆపై భద్రాచలం స్థానం నుంచి పోటీ చేసి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై గెలుపొందారు. జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో మూడు చోట్ల కాంగ్రెస్‌, కొత్తగూడెంలో మిత్రపక్ష సీపీఐ అభ్యర్థి గెలవగా, అప్పటి వరకు కాంగ్రెస్‌ సిట్టింగ్‌ స్థానంగా ఉంటూ వచ్చిన భద్రాచలం బీఆర్‌ఎస్‌ ఖాతాలో పడింది. ఆఖరి నిమిషంలో పార్టీ మారి ఫాయిదా దక్కించుకున్న నేతగా తెల్లం గుర్తింపు పొందారు.

న్యాయస్థానాన్ని ఆశ్రయించిన బీఆర్‌ఎస్‌..

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగిసిన ఆరు నెలల్లోపే బీఆర్‌ఎస్‌ నుంచి ఏకంగా పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ క్యాంప్‌లో చేరిపోయారు. దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలంటూ ముందుగా అసెంబ్లీ స్పీకర్‌ను, ఆ తర్వాత హై కోర్టును బీఆర్‌ఎస్‌ ఆశ్రయించింది. అనేక మలుపుల తర్వాత ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. దీంతో బీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టాలంటూ సుప్రీంకోర్టు సూచించగా.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ ఆగస్టులో నోటీసులు జారీ చేశారు. అనంతరం రెండో విడత విచారణలో భాగంగా తెల్లం వెంకట్రావుతో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్‌ కుమార్‌ గురువారం హాజరుకానున్నారు.

క్రాస్‌ ఎగ్జామినేషన్‌

తమ నియోజకర్గ అభివృద్ధి కోసమే మంత్రులు, సీఎంను కలిశాం తప్పితే ఎక్కడా పార్టీ మారలేదంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు చెప్పుకొస్తున్నారు. దీంతో సదరు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన ఎమెల్యేలు, వారి తరఫున న్యాయవాదులు విచారణ సందర్భంగా తెల్లం వెంకట్రావును క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేసే అవకాశం ఉంది. తొలి విడత విచారణ దాదాపు రెండు నెలల పాటు కొనసాగింది. మూడో విడత విచారణ పూర్తయిన తర్వాత అనర్హత పిటిషన్‌కు సంబంధించిన తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

భద్రాచలం నుంచి బీఆర్‌ఎస్‌ తరఫున ఎన్నికై న వెంకట్రావు

ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం మొదలైంది. అయితే ఎప్పటికప్పుడు ఆ ప్రచారాన్ని ఆయన ఖండిస్తూ తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానంటూ చెబుతూ వచ్చారు. ఇక భద్రాచలం ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతారని అంతా అనుకుంటండగా 2024 ఏప్రిల్‌ 7న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరాల్సి వచ్చిందని ఆ సందర్భంగా ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement