ఆదర్శ నాయకుడు.. ధర్మా
కొత్తగూడెంఅర్బన్ : నమ్మిన సిద్ధాంతం కోసం తుదివరకూ పనిచేసిన ఆదర్శవాది గుగులోత్ ధర్మా అని పలువురు నాయకులు కొనియాడారు. ధర్మా ద్వితీయ వర్ధంతి సందర్భంగా సుజాతనగర్ మండలం మంగపేటలో ఆయన విగ్రహాన్ని, స్మారక స్తూపాన్ని బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. గిరిజన జాతి అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడిన గొప్ప యోధుడని అన్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా, చివరి వరకు ఎర్రజెండా నీడన నడిచారని నివాళులర్పించారు. ఈ ప్రాంతంలో పోరాట పటిమ కలిగిన నాయకుడు కాసాని ఐలయ్య అడుగుజాడల్లోనే ధర్మా పనిచేశారని తెలిపారు. మానవజాతి ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకూ పరిష్కారం చూపించగలిగే శక్తి ఎర్రజెండాకు మాత్రమే ఉందన్నారు. సభలో సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు మచ్చా వెంకటేశ్వర్లు, సాబిర్‌పాషా, నాయకులు పోతినేని సుదర్శన్, బండారు రవికుమార్, పి.సోమయ్య, అన్నవరపు కనకయ్య, ఏజె. రమేష్, కున్సోత్ ధర్మా, భూక్యా వీరభద్రం, గుగులోతు ధర్మా కుమార్తె విజయాబాయి పాల్గొన్నారు.
తేమ పేరుతో కొర్రీలు పెట్టొద్దు..
పత్తిలో తేమ పేరుతో కొర్రీలు విధించకుండా మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. స్థానిక మంచికంటి భవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తేమ శాతం ఎక్కువగా ఉందంటూ ఆంక్షలు పెడుతున్నారని, యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పడంతో రైతులు నష్టపోతున్నారని అన్నారు. ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ అంటోందని, అంతకంటే ఎక్కువ పండిని పత్తిని రైతులు ఏం చేయాలో ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నుంచి పత్తి కొనుగోలు చేయకుండా విదేశాల నుంచి సుంకాలు ఎత్తివేసి దిగుమతి చేసుకుంటోందని, దీంతో రైతులు నష్టపోతున్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు సమ్మెలో ఉన్నాయని, తద్వారా విద్యార్థులు నష్టపోతున్నారని, ప్రభుత్వం యాజమాన్యాలతో చర్చించి రూ.12వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోందని, ఏపీలో ఎన్డీయే భాగస్వామి ప్రభుత్వం ఉన్నందున ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రం ఇలా వ్యవహరిస్తోందని విమర్శించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటాలు తేలే వరకు బనకచర్లకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని, మిగులు జలాల్లో రాష్ట్రాల వాటా తేల్చాలని డిమాండ్ చేశారు.
విగ్రహావిష్కరణలో పలువురు
నేతల నివాళి


