భద్రగిరిలో సత్యనారాయణ వ్రత సందడి
● కార్తీక పౌర్ణమి వేళ రామాలయంలో రద్దీ ● కనులపండువగా నిత్య కల్యాణం
భద్రాచలం : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజామున పవిత్ర గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి నదిలో కార్తీక దీపాలు వదిలారు. ఆతర్వాత రామాలయంలో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్రకూట మండపంలో జరిగిన శ్రీ సత్యనారాయణ స్వా మి సామూహికవ్రతాలకు భారీగా హాజరయ్యారు. అర్చకులు వ్రత విశిష్టతను భక్తులకు వివరించారు.
సుందరం.. సుమనోహరం..
దేవస్థానంలో స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం సుమనోహరంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.


