
శిశువులకు శ్రీరామరక్ష
శిశు మరణాల తగ్గింపే లక్ష్యం
● 108 నియోనాటల్ ద్వారా అత్యవసర వైద్యం ● నవజాత శిశువు మరణాల నివారణే లక్ష్యంగా ఏర్పాటు ● ఉమ్మడి జిల్లాలో 1,971 మందికి సేవలు
ఖమ్మంవైద్యవిభాగం: అప్పుడే పుట్టిన శిశువు మొదలు 30రోజుల లోపు వయస్సు వారిని నవజాత శిశువులుగా పరిగణిస్తారు. ఈ వయస్సు శిశువుల సంరక్షణపై అవగాహన లేక కొన్ని, సరైన పోషణ అందక ఇంకొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఈక్రమాన శిశు మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈనేపథ్యాన మరణాలు తగ్గించేలా అత్యవసర వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 108 నియోనాటల్ వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యాధునిక పరికరాలతో కూడిన ఈ అంబులెన్స్ సేవలతో ఉమ్మడి జిల్లాలో వందలాది మంది శిశువుల ప్రాణాలు నిలిచాయి. ఉమ్మడి జిల్లాకు రెండు అంబులెన్స్‌లు కేటాయించగా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న పసికందులకు సిబ్బంది వైద్యం అందిస్తూనే పెద్దాస్పత్రులకు తరలిస్తూ శిశు మరణాల తగ్గింపునకు పాటుపడుతున్నారు.
రెండేళ్లుగా నిర్వహణ
ఉమ్మడి జిల్లాలో 108 నియోనాటల్ అంబులెన్స్ సేవలు రెండేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు 1,971 మంది శిశువులకు వైద్య సేవలు అందించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారులకు మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సాధారణంగా 108 వాహనంలో శిశువు చికిత్సకు అవసరమైన సౌకర్యాలు ఉండవు. ఈమేరకు ప్రత్యేక పరికరాలతో నియోనాటల్ అంబులెన్స్‌లు సమకూర్చారు. ఇందులో వెంటిలేటర్ సౌకర్యంతో పాటు ఇంక్యూబేటర్, పల్స్ ఆక్సీమీటర్, సిరంజ్ పంప్, ఆక్సిజన్ సిలిండర్ ఉంటాయి. బరువు తక్కువ ఉన్న శిశువులు, గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో పుట్టేవారు, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడేవారికి అత్యవసర చికిత్స అందిస్తూ ఆస్పత్రులకు చేర్చడం సులువవుతోంది.
నవజాత శిశు మరణాల నివారణకు..
కొన్నేళ్లుగా జిల్లాలో శిశు మరణాలు పెరిగాయి. బరువు తక్కువగా పుట్టడం, అవయవాల ఎదుగుదలలో లోపాలతో జన్మిస్తున్న వారికి అత్యవసర వైద్యం అందించాల్సి ఉంటుంది. అయితే, శిశువు పరిస్ధితి ఇబ్బందిగా మారినప్పుడు ప్రైవేట్ వాహనాల్లో ఆస్పత్రికి తరలించేలోగా ప్రాణాలు పోతున్నాయి. ఈ నేపథ్యాన ఉమ్మడి జిల్లాకు రెండు నియోనాటల్ అంబులెన్స్‌లను కేటాయించగా వీటిలో వైద్యం అందిస్తూ పెద్దాస్పత్రులకు తరలిస్తున్నారు. తద్వారా శిశు మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, కొన్ని ఆస్పత్రుల్లో చిన్నచిన్న సమస్యలకు కూడా కొందరు వైద్యులు వైద్యం చేయకుండా రిఫర్ చేస్తున్నారని, అలా కాకుండా జిల్లాలోనే వైద్యం అందించేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో రెండు నియోనాటల్ వాహనాల ద్వారా సేవలు అందుతున్నాయి. శిశువులకు చికిత్స చేస్తూనే పెద్దాస్పత్రులకు తరలించడం ద్వారామరణాలు తగ్గించేందుకు కృషి చేస్తున్నాం. అత్యవసర వైద్యం అవసరమైన శిశువులనే రిఫర్ చేస్తే మరింత మందికి సేవలు అందుతాయి.
– శివకుమార్,
ఉమ్మడి జిల్లా 108 ప్రోగ్రామ్ మేనేజర్

శిశువులకు శ్రీరామరక్ష

శిశువులకు శ్రీరామరక్ష