
కేంద్రీయ విద్యాలయకు స్థలం ఖరారు
పాలకేంద్రం ఏరియాలో నాలుగున్నర ఎకరాలు కేటాయింపు
తాత్కాలికంగా పాతకొత్తగూడెంలో పాఠశాల కొనసాగింపు
త్వరలో పరిశీలించనున్న విద్యాలయ ప్రతినిధులు
కొత్తగూడెంఅర్బన్: కేంద్రీయ విద్యాలయకు స్థలం ఖరారైంది. లక్ష్మీదేవిపల్లి మండలంలోని పాలకేంద్రంలో భవన నిర్మాణానికి నాలుగున్నర ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. జిల్లాకు ఇటీవల కేంద్రీయ విద్యాలయ మంజూరుకాగా, ఏర్పాటు పనులు చకచకా సాగుతున్నాయి. నూతన భవనం అందుబాటులోకి వచ్చేవరకు పాతకొత్తగూడెంలోని తెలంగాణ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లోని ఓ భవనంలో తరగతులు నిర్వహించనున్నారు. ఇప్పటికే 10 గదులతో కూడిన ఖాళీ భవనం కేటాయించగా, రెండు, మూడు రోజుల్లో కేంద్రీయ విద్యాలయ ప్రతినిధులు వచ్చి పరిశీలించనున్నారు. వారి సూచనల మేరకు కొద్ది మార్పులు చేసి కొనసాగించనున్నారు. భవనం రీ మోడలింగ్‌కు జిల్లా విద్యాశాఖ నుంచే నిధుల విడుదల చేసే అవకాశం ఉన్నట్లు విద్యాధికారులు తెలిపారు. ఇక పాల కేంద్రంలో కేటాయించిన నాలుగున్నర ఎకరాల్లో శాశ్వత భవనం నిర్మించనున్నారు.
ఇటీవల పరిశీలించిన కలెక్టర్
పాతకొత్తగూడెంలో కేంద్రీయ విద్యాలయకు కేటాయించిన భవనాన్ని ఇటీవల కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పరిశీలించారు. విద్యాశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. భవనంలో మార్పులకు ప్రతిపాదనలు రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా అందుబాటులోకి తేవాలన్నారు. విద్యాశాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారి రాజగోపాల్ ప్రతిపాదనలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. కేంద్రీయ విద్యాలయ ప్రతినిధులు పరిశీలించాక, వారి సూచనలను కూడా పరిగణలోకి తీసుకుని మార్పులు చేపట్టనున్నారు. కాగా కేంద్రీయ విద్యాలయలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌తో బోధన చేపట్టనున్నారు. అడ్మిషన్లు ఆన్‌లైన్ పద్ధతిలో జరుగుతాయి. ఇప్పటికే జిల్లాలో నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరైంది. స్కూళ్ల ఏర్పాటుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పేద, మధ్య తరగతి విద్యార్థులకు నామినల్ ఫీజులతో నాణ్యమైన విద్య లభించే అవకాశం ఉంది.