
ప్రసవ వేధన తగ్గింది..
ప్రభుత్వాస్పత్రులపై పెరిగిన భరోసా..
తగ్గిన మాతా శిశు మరణాలు
పెరిగిన సాధారణ ప్రసవాలు
జిల్లాలోని ఏడు వైద్యశాలల్లో
12 మంది గైనకాలజిస్టులు
పేదలపై తగ్గిన ఆర్థిక భారం
ఇల్లెందు: ప్రభుత్వ వైద్యశాలల్లో అందుతున్న చికిత్స కారణంగా ప్రసవ వేదన తగ్గింది. ఫలితంగా జిల్లాలో మాతా శిశు మరణాల సంఖ్య తగ్గినట్లు రికార్డులు చెబుతున్నాయి. అలాగే, ఎందరికో ఖరీదైన వైద్యం కూడా ఇప్పుడు ఖర్చు లేకుండా అందుతోంది. ఏడు వైద్య విధాన పరిషత్ పరిధిలో జిల్లాలో కొత్తగూడెం, పాల్వంచ, బూర్గంపాడు, అశ్వారావుపేట, మణుగూరు, భద్రాచలం, ఇల్లెందు, చర్లలో ఏరియా వైద్యశాలలు ఉన్నాయి.. వాటి ల్లో 12 మంది గైనకాలజిస్టులు ఉన్నారు. భద్రాచ లంలో ముగ్గురు, పాల్వంచ, బూర్గంపాడు, చర్లలో ఒక్కొక్కరు, అశ్వారావుపేట, మణుగూరు, ఇల్లెందు లో ఇద్దరు విధులు నిర్వర్తిస్తున్నారు. గత మార్చికి ముందు భద్రాచలంలో 120 వరకు ప్రసవాలు జరుగగా అక్టోబర్‌లో 257వరకు జరిగాయి. ఇక పాల్వంచలో 15 వరకు జరగగా ప్రస్తుతం 50 వరకు జరిగాయి. ఇల్లెందులో 20 నుంచి 51 వరకు జరిగాయి. అశ్వారావుపేటలో 12నుంచి 52 వరకు.. మణుగూరులో 10 నుంచి 101 వరకు పెరిగాయి. చర్ల, బూర్గంపాడులో ఇటీవల గైనకాలజిస్టు నియా మకంతో 15 వరకు జరిగాయి.
అన్ని జిల్లాలతో పోలిస్తే
తెలంగాణలోని ఇతర అన్ని జిల్లాల కంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుఖ ప్రసవాల సంఖ్య ఆరు నెలల కాలంలో పెరిగింది. కలెక్టర్ జితేశ్.వి.పాటిల్, పీఓ రాహుల్, డీసీహెచ్‌ఎస్ జి.రవిబాబు ప్రత్యేకచొరవ తీసుకోవడంతోపాటు అందుకు తగిన సదుపాయాలు కల్పన, గైనకాలజిస్టుల నియామకంతో ఇది సాధ్యమైనట్లు తెలుస్తోంది. ఇక మత్తు వైద్యులు, ల్యాబ్‌లు, ఆపరేషన్ థియేటర్లు, స్కానింగ్ సెంటర్లు, టీ పాస్ సర్వీస్ సెంటర్ల ఏర్పాటు కూడా సుఖ ప్రసవాల పెంపునకు దోహదపడినట్లు వైద్యులు చెబుతున్నారు.
ఇల్లెందు ఏరియా వైద్యశాలలో ఉచితంగా వైద్యంఅందించి సుఖ ప్రసవం చేశారు. ప్రైవేట్ కు వెళి తే రూ.70వేలవరకు ఖర్చు అయ్యే అవకాశం ఉండేది. వైద్యు లు, సిబ్బంది సహకారం కూడా బాగుంది. ప్రభుత్వ దవాఖాన పేదలకు ఎంతో ఉపయోగంగా మారింది.
–పూనెం వినతి, మొట్లగూడెం, ఇల్లెందు మండలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలెక్టర్ జితేశ్ వి పాటిల్‌చొరవ కారణంగా జిల్లాలోని ఏడు ఏరియా వైద్యశాలల్లో సుఖ ప్రసవాలు పెరిగాయి. ప్రత్యేకంగా నిధులు కేటాయించటం, వైద్యశాలల్లో గైనకాలజిస్ట్, మత్తు, స్కానింగ్ వైద్యుల నియామకంతో పాటు ల్యాబ్, ఆపరేషన్ థియేటర్‌లు, మందులు అందుబాటులో ఉంచటంతో ప్రభుత్వ వైద్యశాలలకు వచ్చే వారి సంఖ్య పెరిగింది.
–డాక్టర్ జి.రవిబాబు, డీసీహెచ్‌ఎస్
ప్రభుత్వ వైద్యశాలల్లో సుఖ ప్రసవాలు జరుగుతుండటం వల్ల పేదలపై ఆర్థిక భారం తగ్గింది. ఒక్కో ప్రసవానికి ప్రైవేట్ వైద్యశాలలో అయితే రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతోంది. ప్రభుత్వ వైద్యశాలలో ఖర్చు లేకుండా సుఖ ప్రసవాలు జరుగుతుండటంతో పేదలు ఊపిరిపీల్చుకుంటున్నారు. జిల్లా ఆస్పత్రితోపాటు భద్రాచలం, బూర్గంపాడు, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు, చర్ల, అశ్వారావుపేట ఏరియా వైద్యశాలలు, 29 పీహెచ్‌సీలు, 10 యూపీహెచ్‌సీలు, 376 సబ్ సెంటర్లు ఉన్నాయి. వందల సంఖ్యలో ప్రతీనెలా ప్రసవాలు జరుగుతుంటే ఇందులో ఎక్కువ మంది గతంలో ప్రైవేట్ వైద్యశాలలను ఆశ్రయించి జేబులు ఖాళీ చేసుకున్నవారే. ఇప్పుడు ఏరియా వైద్యశాలల్లో సదుపాయాల కల్పన, గైనకాలజిస్టుల నియామకం వల్ల ఎంతో ఉపయోగంగా మారింది. దీనికి తోడు కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్ తమ సతీమణులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేయించి, ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగించారు.

ప్రసవ వేధన తగ్గింది..

ప్రసవ వేధన తగ్గింది..