
కుండపోత వర్షం
● ఉప్పొంగిన వాగులు, లోతట్టు ప్రాంతాలు జలమయం ● రహదారులపైకి వరదనీరు చేరి రాకపోకలకు అంతరాయం
సాక్షి నెట్‌వర్క్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు కుండపోత వర్షం కురిసింది. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వివిధ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులు, కుంటలు అలుగు పొంగాయి. పంటలు నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. పలుచోట్ల రోడ్లపైకి వరదనీరు చేరింది. గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో కిన్నెరసాని, జల్లేరు, ఏడుమెళికల వాగులు ఉధృతరూపం దాల్చాయి. ఆళ్లపల్లి–కొత్తగూడెం మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
● మణుగూరులో భారీ వర్షం కురిసింది. మున్సిపాలిటీలోని పలు వీధుల్లోకి వరద నీరు చేరింది. మంగళగట్టు, గాంధీ బొమ్మసెంటర్, వినాయకనగర్, శ్రీశ్రీ నగర్ ప్రాంతాల్లో అంతర్గత రహదారులు నీట మునగడంతో ప్రజలు ఇళ్లలోనే ఉండిపోయారు. శాంతినగర్‌లో ఇళ్లను, వాగు మల్లారం డబుల్ బెడ్రూం సముదాయాన్ని వరద నీరు చుట్టు ముట్టింది. వాసవీ సురక్షా బస్టాండ్ వద్ద కార్గో కార్యాలయంలోకి వర్షపు నీరు చేరింది. మున్సిపల్ కమిషనర్ ప్రసాద్, తహసీల్దార్ నరేశ్ పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు. సింగరేణిలో ఓబీ, బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. కోడిపుంజుల వాగు ఉధృతంగా ప్రవహించడంతో పూనెం వారి గుంపు నివాసాలు మునుగుతున్నాయని స్థానికులు ఆందోళన చేపట్టారు. సింగరేణి, పోలీస్ అధికారులు అక్కడకు చేరుకుని నచ్చజెప్పారు.
● అశ్వారావుపేట మండలంలో అశ్వారావుపేట నుంచి సత్తుపల్లి వెళ్లే మార్గంలో నారంవారిగూడెం వద్ద వరదనీరు చేరి జాతీయ రహదారి వాగును తలపించింది. కాంట్రాక్టర్ల్ నిర్లక్ష్యం కారణంగా మున్సిపాలిటీ పరిధిలోని దొంతికుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వర్షపు నీరు చేరింది. మున్సిపల్ కమిషనర్ బానోతు నాగరాజు వెళ్లి వరదనీరు వెళ్లదీసే చర్యలు చేపట్టారు. పెదవాగు ప్రాజెక్ట్ రింగ్‌బండ్‌కు 6.1 మీటర్ల మేర వరద పోటెత్తడంతో మూడు గేట్లను ఎత్తివేసి నీటిని గోదావరిలోకి వదిలారు.
● దుమ్ముగూడెం మండలంలో పర్ణశాల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం వద్ద నారచీరల ప్రాంతం జలమయంగా మారింది. సీతవాగుకు భారీగా వరద నీరు చేరడంతో సీతమ్మ విగ్రహం నీట మునిగింది.
● పినపాక మండలం సాంబయ్యగూడెం సమీపంలో రోడ్డుపై వరద నీరు చేరి మణుగూరు–ఏటునారుగారం మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చింతల బయ్యారం, వెంకటరావుపేట గ్రామాల్లో మిర్చి పంట నీట మునిగింది. కరకగూడెం మండలంలో పలు గ్రామాల్లో వరద నీరు చేరింది. పెద్దవాగు, బూడిదవాగు తదితర వాగులు ఉధృతంగా ప్రవహించాయి. వరి పొలం నీట మునిగింది. అశ్వాపురం, ములకలపల్లి మండలాల్లో కూడా వాగులు ఉధృతంగా ప్రవహించాయి. తుమ్మలచెరువు అలుగు రెండు అడుగులుమేర ప్రవహిస్తోంది.

కుండపోత వర్షం