
మహిళ బలవన్మరణ ం
అశ్వాపురం: మండలంలోని మల్లెలమడుగుకి చెందిన దూదిమెట్ల సరిత (35)భర్తతో గొడవపడి కొన్నేళ్లుగా భద్రాచలంలోని పెట్రోల్ బంక్‌లో పని చేస్తూ జీవనం సాగిస్తోంది. భద్రాచలం సబ్ రిజిస్టార్ ఆఫీసులో ప్రైవేటుగా అటెండర్ పనిచేసే పోతురాజు గురుమూర్తి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. సరిత దగ్గర డబ్బులు తీసుకోవడమే కాకుండా మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో వేధింపులు భరించలేక ఈ నెల 11న గడ్డి మందు తాగిన ఆమె చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. కుటుంబీకుల ఫిర్యాదుతో గురుమూర్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ అశోక్ రెడ్డి తెలిపారు.
చెల్లని చెక్కు కేసులో ఆరు నెలల జైలుశిక్ష
ఖమ్మం లీగల్: తీసుకున్న అప్పు చెల్లించే క్రమాన చెల్లని చెక్కు జారీ చేసిన వ్యక్తికి ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం ఒకటో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయాధికారి బెక్కమ్ రజని సోమవారం తీర్పుచెప్పారు. ఖమ్మం రోటరీనగర్‌కు చెందిన కోటకొమ్ముల నాగరాజు వద్ద భద్రాద్రి జిల్లా పాల్వంచ వాసి బొందిలి రామారావు 2019 నంబర్‌లో రూ.8 లక్షల అప్పు తీసుకున్నారు. తిరిగి 2021 అక్టోబర్‌లో రూ.8లక్షలకు చెక్కు జారీ చేసినా ఖాతాలో సరిపడా నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో నాగరాజు తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశాడు. విచారణ అనంతరం రామారావుకు జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.8లక్షలు చెల్లించాలని తీర్పు చెప్పారు.
యువకుడిపై పోక్సో కేసు
ఖమ్మంక్రైం: బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై ఖమ్మం త్రీటౌన్ పోలీసులు సోమవారం పోక్సో కేసు నమోదు చేశారు. ఖమ్మం జహీర్‌పుర ప్రాంతానికి చెందిన గోపి సుక్కు అదే ప్రాంతానికి బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ మోహన్‌బాబు తెలిపారు.