
బీటీపీఎస్ ఎదుట ఆదివాసీల ఆందోళన
మణుగూరు టౌన్ : బీటీపీఎస్‌లో స్థానిక వీటీడీఏ సొసైటీలకు, స్థానికులకు అవకాశాలు కల్పించాలని, కమీషన్లు తీసుకుని టెండర్లు అప్పగించే సంస్కృతికి స్వస్తి పలకాలని ఆదివాసీ అఖిలపక్ష సంఘాల ఆధ్వర్యంలో ప్లాంట్ ఎదుట సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ చందా లింగయ్య దొర మాట్లాడుతూ.. బీటీపీఎస్ కోసం సేకరించిన భూముల్లో 95 మంది గిరిజనేతరులకు చెందినవి 138 ఎకరాల ఉంటే 767 ఎకరాల భూములున్నట్లు రికార్డులు మార్చి రెవెన్యూ అధికారులు, జెన్కో, బీటీపీఎస్ అధికారులు కోట్ల రూపాయలు కాజేశారని ఆరోపించారు. 1,116 మంది ఆదివాసీల భూములు 2,044 ఎకరాలు ఉండగా 302 మందికి మాత్రమే ప్యాకేజీలు ఇచ్చారని, మిగిలిన వారిని మోసం చేశారని అన్నారు. భూ సేకరణ సమయంలో జీవనోపాధికి నెలకు రూ.5వేలు, గృహ నిర్మాణం, సమీప గ్రామాల అభివృద్ధి వంటి హామీలు ఇచ్చారని, ఇప్పుడు అవన్నీ తుంగలో తొక్కారని విమర్శించారు. అవసరమైతే ప్లాంట్ భూములను రీ సర్వే చేసి అర్హులకు ప్యాకేజీ, ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీటీపీఎస్ వస్తే బతుకులు బాగుపడతాయి అనుకుంటే స్థానికులకు ఉపాధి కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూ నిర్వాసితులంటే ప్లాంట్ అధికారులకు చులకనగా మారిందన్నారు. బూడిద చెరువు, బూడిద రవాణా విధానం టెండర్లను ఆదివాసీ వీటీడీఏ సొసైటీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ప్లాంట్ సీఈ బిచ్చన్నకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ.. ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు నివేదిస్తున్నామని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పాయం సత్యనారాయణ, నాయకులు వాసం రామకృష్ణ, కొమరం రామ్మూర్తి, కొమరం శ్రీను, కలేటి వీరయ్య, చిడెం నాగేశ్వరరావు, కుంజా వెంకటరమణ, ఏనిక మంగమ్మ, పూనెం విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. కాగా, ఆదివాసీ అఖిలపక్ష సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్లాంట్ ఎదుట తలపెట్టిన నిరసనలో అక్రమాల అధికారి తీరుపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలే ప్లకార్డులుగా మారాయి. భూములు సేకరించిన అనంతరం వీటీడీఏ సొసైటీలకు ప్రాధాన్యత తగ్గడం తదితర అంశాలపై సాక్షిలో కథనాలు ప్రచురితమైన విషయం విదితమే.
వీటీడీఏ సొసైటీలకు ప్రాధాన్యత
ఇవ్వాలని డిమాండ్