
పంటలు హరీ !
చెరువులను తలపిస్తున్న పంట చేలు..
చేతికందే సమయంలో భారీ వర్షాలు
దెబ్బతింటున్న పత్తి, వరి, మొక్కజొన్న
పెట్టుబడులు కూడా తిరిగి రావని రైతుల ఆందోళన
బూర్గంపాడు: ఈ ఏడాది వర్షాలు రైతుల వెన్ను విరుస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తే చేతికందే సమయాన భారీ వర్షాలతో దెబ్బతింటున్నాయి. పత్తి తీసే దశకు వచ్చినా వానలతో వీలుపడడం లేదు. కంకి దశలో ఉన్న వరిపొలాలు వర్షాలకు ఒరిగిపోతున్నాయి. ఇటీవలే వేసిన మిరప తోటల్లో నీరు నిల్వడంతో మొక్కలు కుళ్లిపోతున్నాయి. మొక్కజొన్న పంటదీ ఇదే పరిస్థితి. ఓవైపు యూరియా కొరతతో నానా ఇబ్బందులు పడిన రైతులు.. ప్రస్తుత ఎడతెరిపి లేని వర్షాలతో కుదేలవుతున్నారు. పెట్టుబడులు కూడా తిరిగి రావని ఆందోళన చెందుతున్నారు.
మొదట ఆశాజనకంగానే..
జిల్లాలో ఈ ఏడాది వానాకాలం పంటలు సాగు ఆశాజనకంగానే ప్రారంభమైంది. జూన్, జూలైలో అడపా దడపా కురిసిన వర్షాలకు పత్తి, మొక్కజొన్న, అపరాల పంటలు బాగానే మొలకెత్తాయి. నెలన్నర రోజుల వరకు పంటలు ఏపుగా పెరిగి రైతుల్లో ఆశలు కల్పించాయి. ఇక ఆగస్టు నుంచి ఆరంభమైన వానలు రైతులను రోజురోజుకూ కుంగదీస్తున్నాయి. ఈ ఏడాది వర్షాలతో పాటు యూరియా కొరత కూడా వారిని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసింది. యూరియాకు బదులు ఎక్కువ ఖర్చు చేసి కాంప్లెక్స్ ఎరువులు వేసుకుని పంటలు సాగు చేశారు. అయితే అధిక వర్షాలతో వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు తెగుళ్ల ఉధృతి ఎక్కువై పంటలకు నష్టం కలిగించాయి. దీంతో సస్యరక్షణ చర్యలకు అధికంగా పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం పత్తి తొలివిడత తీసేందుకు సిద్ధమైంది. కానీ వర్షాలతో వీలు పడడం లేదు.
వరి పంటకూ ప్రతికూలం..
జిల్లాలో సాగు చేసిన వరి పంట ప్రస్తుతం కంకి వెళ్లే దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో పొట్టదశలో, మరికొన్ని చోట్ల కంకి వెళ్లి గింజపోసుకునే దశలో ఉన్నాయి. అయితే గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలు ప్రతికూలంగా మారాయి. వరిపొట్టలోకి నీరు చేరడంతో చీడపీడలు ఎక్కువవుతున్నాయి. కంకి వెళ్లిన పంటలో సుంకు రాలిపోతోంది. కంకి వెళ్లి గింజపోసుకుంటున్న వరి వానలకు నేలవాలుతోంది. మొక్కజొన్న పంటకు కూడా వర్షాలు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. అధిక వానలతో కంకి సరిగా రావడం లేదని రైతులు చెబుతున్నారు. ఇక ఇటీవల వేసిన మిర్చి తోటలకు కూడా వానలు ప్రతిబంధకంగా మారాయి. మొక్కలు ఎర్రబారి చనిపోతున్నాయి.
జిల్లాలో ఈ ఏడాది 2.21లక్షల ఎకరాల్లో పత్తి, 1.85లక్షల ఎకరాల్లో వరి, 28వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. సుమారు పదివేల ఎకరాల్లో మిర్చి సాగు చేసే అవకాశం ఉండగా ఇప్పటికే ఆరువేల ఎకరాల్లో సాగైంది. ప్రస్తుతం పత్తి చేతికందే దశలో ఉండగా వారం, పది రోజుల్లో వరి కోతలు కూడా ప్రారంభం కావాల్సి ఉంది. ఈ తరుణంలో మూడురోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలు చెరువులను తలపిస్తుండగా రైతులకు తీరని నష్టం వాటిల్లుతోంది. ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, చెరువులు పొంగిప్రవహిస్తున్నాయి. భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం, అశ్వారావుపేట వ్యవసాయ డివిజన్లలో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

పంటలు హరీ !