
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు నిత్యకల్యాణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
జిల్లా జడ్జిని కలిసిన ఎఫ్‌డీఓ
పాల్వంచరూరల్ : ఇటీవల ఏర్పాటైన వైల్డ్‌లైఫ్ నల్సా కమిటీ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, జిల్లా జడ్జి పాటిల్ వసంత్‌ను వైల్డ్‌లైఫ్ ఎఫ్‌డీఓ, నల్సా జిల్లా నోడల్ అధికారి బి.బాబు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై ఉంచిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని చెప్పారు.
భోజనంలో
నాణ్యత పాటించాలి
ఎస్సీ డీడీ శ్రీలత
పినపాక: సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యత పాటించాలని డీడీ శ్రీలత సిబ్బందిని ఆదేశించారు. పినపాక హాస్టల్‌లోని భోజనశాల, విద్యార్థుల గదులు, పరిసరాలను సోమవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హాస్టల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులుంటే తమకు సమాచారం అందించాలన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో 2025 – 26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న 9, 10 తరగతి బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాల మంజూరు కోసం ఈ–పాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పి.విజయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. https:// telanganaepass. cgg. gov. in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఏడాది ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించి ఉండొద్దని, మీ సేవ ద్వారా తహసీల్దార్‌తో ధ్రువీకరించిన ఆదాయ సర్టిఫికెట్, ఆధార్‌కార్డు, బీసీ ధ్రువీకరణ పత్రం, విద్యార్థి బ్యాంక్ పాస్‌బుక్, తల్లి/తండ్రి జాయింట్ ఖాతాతో తెరచిన జిరాక్స్ కాపీ జత చేయాలని సూచించారు. ఆన్‌లైన్‌లో పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్యాలయంలో అందజేయాలని వివరించారు.
ప్రజావాణి వెలవెల
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై 11 దరఖాస్తులు వచ్చాయని ఆర్డీఓ మధు తెలిపారు. కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచి 3, చుంచుపల్లి మండలం నుంచి 4, జూలూరుపాడు, టేకులపల్లి, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి మండలాల నుంచి ఒక్కొక్క దరఖాస్తు మాత్రమే వచ్చాయి. మొత్తంగా ఫిర్యాదుదారులు ఎక్కువగా లేకపోవడంతో గ్రీవెన్స్ సెల్ వెలవెలబోయింది.

రామయ్యకు ముత్తంగి అలంకరణ

రామయ్యకు ముత్తంగి అలంకరణ