
మక్కలు కొంటారా.. కొనరా?
● జిల్లాలో లక్ష ఎకరాల్లో మొక్కజొన్న సాగు ● నూర్పిళ్లు పూర్తి చేసి గింజలు ఆరబెడుతున్న రైతులు ● కొనుగోలు కేంద్రాల ఏర్పాటును ప్రకటించని మార్క్‌ఫెడ్ ● అదే అదునుగా తక్కువ ధరకు దక్కించుకునేలా వ్యాపారుల యత్నం
ఇల్లెందురూరల్: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో తాత్సారంతో ఏటా రైతులు నష్టపోతున్నారు. ఈ ఏడాదీ అదే పరిస్థితి నెలకొంటోంది. అధిక వర్షాలు, వాతావరణ ప్రతికూలత నడుమ సాగు చేసిన రైతులకు చివరకు గిట్టుబాటు ధర కూడా లభించడంలేదు. గతేడాది మిర్చి, పత్తి సాగులో తీవ్రంగా నష్టపోయిన రైతులు ఈ ఏడాది మొక్కజొన్న సాగుపై ఆసక్తి చూపారు. జిల్లాలో మొక్కజొన్న లక్ష ఎకరాల్లో సాగు చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఖరీఫ్‌లో మొక్కజొన్న ఎకరం విస్తీర్ణంలో 25 క్వింటాళ్లు, రబీలో 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అతివృష్టి, అనావృష్టి కారణంగా ఈ దఫా ఎకరానికి అత్యధికంగా 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. ఈ లెక్కన జిల్లాలో ప్రస్తుత సీజన్‌లో కనీసం 15 లక్షల క్వింటాళ్ల మక్కలు ప్రస్తుతం మార్కెట్‌కు చేరే అవకాశం ఉంది.
పెరిగిన పెట్టుబడి
ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే వర్షాభావంతో విత్తనాలు మొలకెత్తలేదు. రెండో దఫా విత్తాల్సి రావడంతో పెట్టుబడి భారం పెరిగింది. మొక్క ఎదుగుతున్న దశలో వర్షాభావం తీవ్ర ప్రభావం చూపింది. ఆ తర్వాత అధిక వర్షాలు కోలుకోకుండా చేశాయి. ప్రధానంగా కంకి పాలుపోసే దశలో, గింజ పక్వానికి వచ్చే దశలో ప్రతికూల వాతావరణం దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. ఫలితంగా ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 15 క్వింటాళ్లకు పడిపోయింది.
ధర తగ్గిస్తున్న దళారులు
ఈ సారి ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధర క్వింటాల్‌కు రూ.2,400గా నిర్ణయించింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కాకపోవడంతో దళా రులు మక్కల ధరను తగ్గించేశారు. క్వింటాల్‌కు రూ.1,600 నుంచి రూ.1,700 వరకు చెల్లిస్తామని చెబుతున్నారు. దీంతో రైతులు క్వింటాకు రూ.700 నుంచి రూ.800 వరకు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు వర్షం ఎప్పుడు వస్తుందో తెలియక అయోమయ పరిస్థితి నెలకొంది.

మక్కలు కొంటారా.. కొనరా?