
గ్రామాల్లో అవగాహన కల్పించాలి
చుంచుపల్లి: వైద్య బృందాలు గ్రామాల్లో పర్యటిస్తూ కేన్సర్, బీపీ, షుగర్ వంటి వ్యాధులపై అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.జయలక్ష్మి అన్నారు. సోమవారం కొత్తగూడెంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆహారపు అలవాట్లను సైతం సూచించాలన్నారు. కేన్సర్, బీపీ, షుగర్ వంటి వ్యాధుల స్క్రీనింగ్ నిర్వహించి, డేటాను ఆలస్యం లేకుండా నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్లు మధువరణ్, శ్రీకాంత్ ఫ్రంట్‌లైన్ వర్కర్లు పాల్గొన్నారు.
మేళ్లమడుగులో
పూరిల్లు దగ్ధం
కాలిబూడిదైన సర్టిఫికెట్లు, నగదు, సామగ్రి
టేకులపల్లి: అగ్ని ప్రమాదంలో సోమవారం పూరిల్లు దగ్ధమైంది. మండలంలోని మేళ్లమడుగు గ్రామానికి చెందిన వట్టం నాగేశ్వర్‌రావు, జానకి దంపతులు ఇంటికి తాళం వేసి ఇద్దరు కుమార్తెలతో కలిసి పెట్రాంచెలక వెళ్లారు. షార్ట్ సర్క్యూట్‌తో భారీగా మంటలు చెలరేగి ఇల్లు దగ్ధమైంది. రూ. 50వేల నగదు, ఇద్దరు కుమార్తెల డిగ్రీ, నర్సింగ్ కోర్సులు, ఇతర సర్టిఫికెట్లు, బట్టలు, మంచాలు, వంట సామగ్రి , ధాన్యం కాలిపోయాయి. బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితులను ఓదార్చా రు. ఆర్థిక సాయం అందించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్‌ఐ సౌజన్య ప్రమాద వివరాలు నమోదు చేసుకుని తక్షణ సాయం కింద బాధిత కుటుంబానికి 25 కేజీల బియ్యం, 5వేల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్కినేని సురేందర్, కోరం సురేందర్, సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ రాజేందర్, ఈది గణేష్, రెడ్యానాయక్, మాడె మధు, మంగీలాల్, సరిత, సర్ధార్ తదితరులు పాల్గొన్నారు.
ఇంట్లో సామగ్రి..
అశ్వాపురం : మండలకేంద్రంలోని మంచికంటి నగర్‌కు చెందిన సరస్వతి ఇంట్లో సోమవారం సామగ్రి దగ్ధమైంది. ఇంట్లో దేవుడి వద్ద వెలిగించిన దీపం నుంచి మంటలు వ్యాపించి బట్టలు, సామాన్లు, సిమెంట్ రేకులు, ఎల్‌ఈడీ టీవీ కాలి పోయాయి. సుమారు రూ. లక్ష నష్టం వాటిల్లింది. ఆర్‌ఐ లీలావతి ఇంటిని పరిశీలించి నష్టం వి వరాలు నమోదు చేశారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది.
వేధింపుల కేసు నమోదు
భద్రాచలంఅర్బన్: భద్రాచలం పోలీసులు సోమవారం వేధింపుల కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఏఎస్‌ఆర్ కాలనీకి చెందిన మడిపల్లి సంధ్యకు రాజాతో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి జరిగిన కొన్ని నెలల నుంచే భర్త రాజా, అత్త లక్ష్మి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో ఆమె భర్త, అత్తపై ఎస్‌ఐ సతీష్ కేసు నమోదు చేశారు.

గ్రామాల్లో అవగాహన కల్పించాలి