
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
● ఐటీడీఏ పీఓ రాహుల్ ● గిరిజన దర్బార్‌లో దరఖాస్తుల స్వీకరణ
భద్రాచలం : ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆయన దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి దర్బార్‌కు వచ్చే గిరిజనుల సమస్యలను అర్హతల మేరకు సకాలంలో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఆయా వినతులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, సమస్య పరిష్కారం అయ్యేంతవరకు పర్యవేక్షించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, డీడీ అశోక్, ఈఈ మధుకర్, గురుకులాల ఆర్‌సీఓ అరుణకుమారి, ఏడీఎంహెచ్‌ఓ సైదులు, ఏఓ రాంబాబు, ఇన్‌చార్జ్ ఎస్‌ఓ భాస్కరన్, ఉద్యాన అధికారి ఉదయ్‌కుమార్, ఏపీఓ(పవర్) వేణు పాల్గొన్నారు.
రికార్డులు సక్రమంగా నిర్వహిచాలి..
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో రికార్డులు సక్రమంగా నిర్వహించాలని పీఓ రాహుల్ సిబ్బందికి సూచించారు. ఐటీడీఏలోని గిరిజన సంక్షేమ కార్యాలయాన్ని సోమవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. సర్వీస్ బుక్‌ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీడీ అశోక్, పర్యవేక్షకురాలు ప్రమీలబాయ్, సిబ్బంది రమణమూర్తి, రామకృష్ణారెడ్డి, శ్రీధర్ పాల్గొన్నారు.