
రామాలయంలో మళ్లీ అంతర్గత బదిలీలు
భద్రాచలం: శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో సోమవారం మళ్లీ అంతర్గత బదిలీలు చేశారు. ఈఓ కొల్లు దామోదర్‌రావు బాధ్యతలు స్వీకరించాక ఇది రెండోసారి. ఈఓ సీసీ, గోశాల ఫైల్ కరస్పాండెన్స్ ఎ.శ్రీనివాసరెడ్డికి సెంట్రల్ స్టోర్స్ ఇన్‌చార్జ్‌గా అదనపు బాధ్యతలు, సీనియర్ అసిస్టెంట్ ఆర్.బాలాజీని అన్నదాన సత్రం ఇన్‌చార్జ్ నుంచి ప్రసాదాల తయారీవిభాగానికి, ప్రసాదాల విభాగంలో పని చేస్తున్న శ్రీనివాసరావును పర్ణశాల గుమస్తా, ఆ పోస్టులో ఉన్న కన్సాలిడేటెడ్ ఎం.అనిల్‌కుమార్‌ను దేవస్థానంలో కీలక విభాగమైన ఎస్టాబ్లిష్‌మెంట్, పే బిల్స్‌కు బదిలీ చేశారు. ఎస్టాబ్లిష్‌మెంట్ క్యాషియర్ టి.రాజేష్‌ను డిపాజిట్, డీడీ, ఇతర రిజిస్టర్లకు, ప్రసాదాల విభాగంలో ఉన్న సతీష్‌ను ఈఓ అటెండర్‌గా, ఈఓ అటెండర్‌గా ఉన్న నందసాయిని ప్రసాదాల ఇన్‌చార్జ్‌గా, కంప్యూటర్ ఆపరేటర్ ఎం.మృణాళినిని ఇంజనీరింగ్ సెక్షన్ ఓఎస్‌గా, ఫైల్ కరస్పాండెన్స్‌గా, సునీతకు ప్రొటోకాల్ ఆఫీస్ ఇన్‌చార్జ్‌గా, వస్త్రాల స్టోర్స్ ఇతర బాధ్యతలు అప్పగించారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు కీలక బాధ్యతలు..?
ఈఓ బాధ్యతలు స్వీకరించిన అనతికాలంలోనే రెండుసార్లు అంతర్గత బదిలీలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇవి సాధారణమే అయినా అన్ని విభాగాల్లో ఒకేసారి పెను మార్పులు చోటుచేసుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. ఇక ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న కొందరికి కీలక విభాగాలు అప్పగించడంపై కొందరు అభ్యంతరం తెలుపుతున్నారు.