
ఇంధనంపై నజర్
అదనపు ఆదాయం కోసం
సంస్థ ప్రణాళిక
ప్రతీ నెల లీజ్ రెంట్, ఆయిల్‌పై కమీషన్
ఎన్‌ఓసీలు తీసుకునే పనిలో నిమగ్నం
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ వినియోగదారులు.. కొన్ని బంకుల వారు చేసే మోసాలతో నష్టపోతున్నారు. డబ్బులు సరిగానే తీసుకుంటున్నా పెట్రోల్, డీజిల్ తక్కువగా కొట్టడం, ఇంధనంలో కల్తీ వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తద్వారా వాహనాలు సైతం మరమ్మతులకు గురవుతున్నాయి. పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేసి బంక్ నిర్వాహకులకు జరిమానాలు విధిస్తున్నా.. చాలా బంక్‌ల యాజమాన్యాల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. ఈ క్రమంలో సింగరేణి ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ బంక్‌ల ఏర్పాటుతో నాణ్యమైన ఇంధనం లభ్యమవుతుందని, తగ్గింపులు ఉండవని వాహనదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగూడెంఅర్బన్: బొగ్గు ఉత్పత్తితో పాటు అదనపు ఆదాయం సమకూర్చుకునే మార్గాలను ఎంచుకుంటున్న సింగరేణి.. అందులో రాణించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బంగారం, రాగి గనుల అన్వేషణ, సోలార్ విద్యుదుత్పత్తితో పాటు పెట్రోల్ బంకుల ఏర్పాటుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో ఏడు ఏరియాల్లో బంకుల ఏర్పాటు ప్రక్రియ వేగవంతమవుతోంది. ఆయిల్ కంపెనీలకు సింగరేణి స్థలాలు లీజుకు ఇచ్చేందుకు పది రోజుల క్రితమే భూమి కేటాయించారు. తద్వారా సంస్థ స్థలాలను కాపాడుకోవడంతో పాటు వాటి నుంచి ఆదాయం రాబట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆయిల్ కంపెనీలు బంక్‌లు నిర్మించి ఇస్తే వాటి నిర్వహణ బాధ్యతను సింగరేణి అధికారులే చూస్తారు. సంస్థ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ బంక్‌ల ఏర్పాటుతో వాహనాదారుల్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఏడు బంకుల ఏర్పాటు..
సింగరేణి ప్రాంతాలైన మందమర్రి, బెల్లంపల్లి, కొత్తగూడెం, మణుగూరు, రామగుండం ఏరియాలో మొత్తం ఏడు బంకుల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ఆయిల్ కంపెనీలకు భూమిని సైతం కేటాయించగా.. ఎన్‌ఓసీ కోసం ఆయా జిల్లాల కలెక్టర్లతో పాటు నాగపూర్‌లోని పీఈఎస్‌ఓకి ఆయా కంపెనీల యాజమాన్యాలు దరఖాస్తు చేశాయి. అనుమతి రాగానే పెట్రోల్ బంకుల ఏర్పాటు పనులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం కేటాయించిన స్థలాలను చదును చేస్తున్నారు. ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంకులు నిర్మించి సింగరేణికి అప్పగిస్తే.. నిర్వహణ బాధ్యతలను సంస్థ ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. సింగరేణి స్థలానికి లీజుతోపాటు లీటర్ పెట్రోల్, డీజిల్ విక్రయాలపై రూ.2 చొప్పున కమీషన్ ఇచ్చేందుకు ఆయిల్ కంపెనీలు ఒప్పందం చేసుకున్నాయి. తొలిదశలో ఏడు బంక్‌లు నిర్మిస్తుండగా.. ఇవి విజయవంతంగా నడిస్తే భవిష్యత్‌లో మరిన్ని బంకుల ఏర్పాటుకు అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పెట్రోల్ బంకుల ఏర్పాటుతో స్థానికంగా ఉండే నిరుద్యోగులకు కూడా ఉపాధి లభించే అవకాశం ఉంటుంది.
పెట్రోల్‌బంక్‌ల ఏర్పాటుకు సింగరేణి స్థలాల లీజు

ఇంధనంపై నజర్