
పది రోజుల్లో పత్తి కొనుగోళ్లు
జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలతో సీసీఐ చర్చలు
నిబంధనల సడలింపుతో టెండర్ల దాఖలు
క్రాప్ బుకింగ్ ఆధారంగా స్లాట్ల కేటాయింపు
తేమ శాతం ఆధారంగా పత్తి ధర (రూ.ల్లో)
పత్తి సాగు విస్తీర్ణం, దిగుబడి అంచనా
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లకు రంగం సిద్ధమైంది. ఇన్నాళ్లు సీసీఐ నిబంధనలు కఠినంగా ఉన్నాయని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు టెండర్లకు దూరంగా ఉన్నాయి. ఆగస్టు మొదటి వారంలోనే సీసీఐ జిన్నింగ్ మిల్లులను గుర్తించి, మూడుసార్లు గడువు పొడిగించినా టెండర్ల దాఖలకు ముందుకు రాలేదు. ప్రభుత్వ కొనుగోళ్లు లేకపోవడంతో తేమ, నాణ్యత సాకుతో వ్యాపారులు క్వింటాకు రూ.6 వేలు మించి చెల్లించడం లేదు. ఫలితంగా కేంద్రప్రభుత్వం పత్తికి తేమశాతం ఆధారంగా రూ.8,110గా నిర్ణయించిన గరిష్ట దక్కక రైతులు నష్టపోతున్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని మరోమారు చర్చలు జరిపి నిబంధనల్లో కొన్ని మార్పులు చేయడంతో ఉమ్మడి జిల్లాలోని 15మిల్లుల యజమాన్యాలు టెండర్లు దాఖలు చేశాయి. ఈ టెండర్లను పరిశీలించి కలెక్టర్ల ఆమోదంతో వారంలోగా ఖరారు చేయనున్నారు. ఆపై పది రోజుల్లోగా సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు మొదలుకానున్నాయి.
క్రాప్ బుకింగ్ ఆధారంగానే...
సీసీఐ పత్తి కొనుగోళ్లకు క్రాప్ బుకింగ్ ముడిపడి ఉండటంతో వ్యవసాయ శాఖ పంట నమోదును వేగవంతం చేసింది. కొనుగోళ్లలో పారదర్శకత కోసం స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. దీనికోసం‘కపాస్ కిసాన్ యాప్’ను ప్రవేశపెట్టగా వ్యవసాయ అధికారులు పంట నమోదు పూర్తి చేసి వివరాలను మార్కెటింగ్ శాఖకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ వారంలో ఇది కూడా పూర్తయితే యాప్‌లోనే రైతులు స్లాట్ బుక్ చేసుకొని నేరుగా కేటాయించిన జిన్నింగ్ మిల్లులో పత్తి విక్రయించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇదంతా త్వరలోనే పూర్తిచేసి ఈనెల 22, 23వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడానికి సమాయత్తమవుతున్నారు.
సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఇవే...
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పరిధి ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరిలోని జీఆర్‌ఆర్ ఇండస్ట్రీస్, తల్లంపాడులోని శ్రీ సాయి బాలాజీ జిన్నింగ్ అండ్ ఆయిల్ మిల్లులో సీసీఐ పత్తి కొనుగోలు చేయనుంది. అలాగే, మధిర మార్కెట్ పరిధి దెందుకూరులోని అమరావతి టెక్స్‌టైల్స్, మాటూరులోని మంజీత్ కాటన్ మిల్, ఇల్లెందులపాడులోని శ్రీ శివ గణేష్ కాటన్ ఇండస్ట్రీస్, నేలకొండపల్లి మార్కెట్ పరిధి ముదిగొండ మండలం సువర్ణాపురంలోని ఉషశ్రీ కాటన్ అండ్ జిన్నింగ్ మిల్, వైరా మార్కెట్ పరిధి తల్లాడలోని స్టాప్లరిచ్ జిన్నింగ్ ఇండస్ట్రీస్, మద్దులపల్లి మార్కెట్ పరిధి ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్‌లోని జీఆర్‌ఆర్ జిన్నింగ్ మిల్, తిరుమలాయపాలెం మండలం గోల్‌తండాలోని శ్రీ భాగ్యలక్ష్మి కాటన్ ఇండస్ట్రీస్‌తో పత్తి కొనుగోలు చేస్తారు. ఇక భద్రాద్రి జిల్లాకు సంబంధించి ఇల్లెందు మార్కెట్ పరిధి కారేపల్లిలోని లక్ష్మీప్రియ జిన్నింగ్ మిల్, శ్రీలక్ష్మీప్రియ కొటెక్స్ జిన్నింగ్ మిల్, కొత్తగూడెం మార్కెట్ పరిధిలోకి వచ్చే కొత్తగూడెంలోని మంజిత్ జిన్నింగ్ మిల్, బూర్గంపాడు మార్కెట్ పరిధి బూర్గంపాడులోని అనూశ్రీ జిన్నింగ్ మిల్, శ్రీ లక్ష్మీనర్సింహ జిన్నింగ్ మిల్, శ్రీ రమేష్ ఇండస్ట్రీస్ జిన్నింగ్ మిల్, భద్రాచలం మార్కెట్ పరిధి అశ్వాపురంలోని శ్రీరామా జిన్నింగ్ మిల్లులోపత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తేమ మద్దతు ధర
8 8,110
9 8,029
10 7,948
11 7,867
12 7,786
జిల్లా సాగు దిగుబడి
(ఎకరాల్లో) (క్వింటాళ్లలో)
ఖమ్మం 2,25,613 27,07,356
భద్రాద్రి కొత్తగూడెం 2,40,345 28,05,576