
పాల్వంచలో మరో థర్మల్ ప్లాంట్ !
సాధ్యాసాధ్యాలు పరిశీలించాలన్న జెన్‌కో
ప్రైవేట్ కన్సల్టెన్సీకి బాధ్యతలు..
అందుబాటులో 400 ఎకరాల స్థలం
పాల్వంచ: పాల్వంచలో మరో థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ముందడుగు పడింది. కొత్తగా ఒకటి లేదా రెండు ప్లాంట్ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై నివేదిక తయారు చేయాలని జెన్‌కో యాజమాన్యం న్యూ ఢిల్లీకి చెందిన డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సల్టెన్సీకి అప్పగించింది. ఈ మేరకు కన్సల్టెన్సీ బృందం పాత ప్లాంట్ ప్రదేశంలో త్వరలో సర్వే చేపట్టనుంది. అయితే అల్ట్రా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కలిగిన 800 మెగావాట్ల ప్లాంట్ల ఏర్పాటు సాధ్యమేనా అనే అంశంపైనా పరిశీలన చేయనున్నారు.
ఖాళీగా 400 ఎకరాలు..
పాత ప్లాంట్ కూల్చివేతతో సుమారు 400 ఎకరాల స్థలం ఖాళీ అయింది. ఇక్కడ నీటి వనరులు, రైల్వే మార్గం, సింగరేణి బొగ్గు, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లు, రిజర్వాయర్‌లు, యాష్ పాండ్‌ల వంటి భౌగోళిక వనరులు అందుబాటులో ఉన్నందున తక్కువ ఖర్చుతో మరో ప్లాంట్ నిర్మించాలని పలువురు కోరారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సైతం ఇటీవల పార్లమెంట్‌లో ఇదే అంశాన్ని కోరగా కేంద్రం సుముఖత వ్యక్తం చేసి తమ వంతు నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో జెన్‌కో యాజమాన్యం కొత్త ప్లాంట్ సాధ్యాసాధ్యాలపై సర్వే చేయాలని ఢిల్లీకి చెందిన డిజైన్ కంపెనీకి బాధ్యతలు అప్పగించింది. త్వరలోనే సదరు కంపెనీ బృందం కర్మాగారాన్ని సందర్శించనుంది.
పాత ప్లాంట్ కూల్చివేతతో తీరని నష్టం..
పాల్వంచలో 1965 – 78 మధ్య కాలంలో కేటీపీఎస్ ఓఅండ్‌ఎం కర్మాగారాన్ని నిర్మించారు. ఇందులో ఏ, బీ, సీ స్టేషన్లలో 1, 2, 3, 4 యూనిట్లు ఏర్పాటు చేసి 720 మెగావాట్ల విద్యుదుత్పత్తిని ప్రారంభించారు. జపాన్ టెక్నాలజీతో తొలి యూనిట్ నిర్మాణానికి రూ.59.29 కోట్లు ఖర్చు చేశారు. ఈ కర్మాగారం కాలం చెల్లడంతో పర్యావరణ పరిస్థితుల దృష్ట్యా 2018లో మూసేశారు. అనంతరం ఈ కర్మాగారంలో దశల వారీగా కూల్చివేత పనులు చేపట్టి గతేడాది ఆగస్టు 5న చివరగా కూలింగ్ టవర్లను నేలమట్టం చేశారు. అయితే ఈ కర్మాగారం తొలగింపుతో ఇక్కడ పనిచేసే ఉద్యోగులు సుమారు 2,500 మందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాల్సి వచ్చింది. దీని ప్రభావం ఈ ప్రాంత అభివృద్ధిపై కూడా పడింది. కొత్తగా సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కలిగిన 7వ దశ నిర్మాణం జరిగినా తక్కువ మంది ఉద్యోగులతోనే కర్మాగారం నడుస్తుండడంతో అత్యధిక శాతం మంది ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు.