
స.హ.చట్టం.. శక్తివంతమైన ఆయుధం
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రతీ పౌరుడు సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంచుకోవాలని, తద్వారా ప్రభుత్వ కార్యకలాపాలపై సమాచారం పొందడమే కాక ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ చట్టం ప్రజలకు శక్తినిచ్చే పదునైన ఆయుధం వంటిదని అన్నారు. పారదర్శకత పెంపొందించి, అధికారుల్లో జవాబుదారీతనాన్ని నెలకొల్పుతుందని చెప్పారు. ప్రజలు కోరిన సమాచారాన్ని సకాలంలో అందించడం ద్వారా పాలనలో విశ్వసనీయత పెరుగుతుందని అన్నారు. శాఖల వారీగా నిర్వహిస్తున్న కార్యకలాపాలు, సేవలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ఆదేశించారు. ప్రతీ కార్యాలయంలో పీఐఓ, ఏపీఐఓ, అప్పీలేట్ అథారిటీని నియమించి, ఆర్టీఐ దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించాలని అన్నారు. సమాచారం ఇచ్చేందుకు నిరాకరించాల్సి వస్తే అందుకు గల కారణాలను స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. అన్ని శాఖల సిబ్బందికి ఈ చట్టంపై అవగాహన కల్పించాలని, ఈ మేరకు శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, సీపీఓ సంజీవరావు, డీఏఓ బాబురావు, డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి, డీఎస్‌ఓ రుక్మిణి, బీసీ సంక్షేమాధికారి విజయలక్ష్మి, ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్, భూగర్భ జల శాఖాధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోడౌన్ తనిఖీ..
కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం తనిఖీచేశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు తనిఖీ చేశామని, ఈవీఎం, వీవీ ప్యాట్లు ఉన్న గదిని, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించామని తెలిపా రు. గోడౌన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేనిదే ఎవరిని లోపలికి రానివ్వొద్దని అధికారులను, సెక్యూరిటీ గార్డ్‌ను ఆదేశించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్లో సంతకం చేశారు. ఆయన వెంట ఎన్నికల సూపరింటెండెంట్ రంగాప్రసాద్, ఎలక్షన్ సెల్ సిబ్బంది నవీన్ పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్