
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, నిత్యకల్యాణ వేడుకకు చైన్నె భక్తులు పోటెత్తారు. ఏకకాలంలో 200 మంది దంపతులు పాల్గొనడంతో చిత్రకూట మండపం కిటకిటలాడింది. చైన్నెలోని ఓ ఆధ్యాత్మిక సంస్థకు చెందిన సభ్యులు ముందుగానే నిత్యకల్యాణ టికెట్లు బుక్ చేసుకున్నారు. కల్యాణం అనంతరం స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చైన్నె, ఇతర భక్తులు కలిపి మొత్తం 240 జంటలు నిత్యకల్యాణంలో పాల్గొనడం రికార్డుగా నమోదైంది. కాగా, శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారికి అభిషేకం, ప్రత్యక పూజలు చేశారు.
నిత్యకల్యాణానికి హాజరైన 200 మంది
చైన్నె భక్త దంపతులు

స్వర్ణకవచాలంకరణలో రామయ్య