
ముగ్గురికి గ్రూప్ –1 కొలువులు
దమ్మపేట/టేకులపల్లి/భద్రాచలంటౌన్ : గ్రూప్ –1లో జిల్లాకు చెందిన ముగ్గురు కొలువులు సాధించారు. దమ్మపేట మండలం తాటిసుబ్బన్నగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువకుడు తాటి ప్రమోద్ సాయి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ విభాగంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా మల్టీ జోన్ పరిధిలో ఉద్యోగం పొందనున్నారు. ఆయన తల్లి సుదర్శనమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు కాగా, తండ్రి చిన్నతనంలోనే రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రమోద్‌సాయి పాఠశాల విద్య అనంతరం ఇంటర్, ఇంజనీరింగ్ హైదరాబాద్‌లో పూర్తి చేశారు. ఆ తర్వాత ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకుని, సివిల్స్, గ్రూప్ –1 ఉద్యోగాలకు సన్నద్ధం కాగా గత మే నెలలో ప్రకటించిన రాత పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 317వ ర్యాంకు సాధించారు. టేకులపల్లి మండలం కొత్తతండా(పి) గ్రామానికి చెందిన రమావత్ లక్ష్మీప్రసన్న గ్రూప్–1లో సత్తా చాటి గ్రేడ్ – 2 మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం సాధించారు. నాగార్జునసాగర్‌కు చెందిన లక్ష్మీప్రసన్నకు తొమ్మిది నెలల క్రితం కొత్తతండాకు చెందిన బానోత్ జనార్దన్‌తో వివాహమైంది. పదో తరగతి వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో, ఇంటర్, ఎంబీబీఎస్ హైదరాబాద్‌లో చదివారు. ఆ తర్వాత యూపీఎస్‌సీ లక్ష్యంగా ఢిల్లీలో కోచింగ్ తీసుకుని పరీక్ష రాయగా మూడు సార్లు మెయిన్‌లో క్వాలిఫై అయినా ఇంటర్వ్యూలో ఉద్యోగం కోల్పోయారు. ప్రస్తుతం విజయం సాధించారు. కాగా, జనార్దన్ జీహెచ్‌ఎంసీలో టీపీబీఓగా పని చేస్తున్నారు. భద్రాచలం వైఎస్సార్ నగర్‌కు చెందిన ఎడారి రేవంత్ గ్రూప్–1లో మొదటి ప్రయత్నంలోనే డీపీఓగా ఉద్యోగం సాధించారు. స్థానిక సెయింట్ పాల్ స్కూల్‌లో పదో తరగతిలో ఉత్తమ ర్యాంక్, వరంగల్ ఐఐటీలో బీటెక్ సివిల్ ఇంజనీరింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. తన తండ్రి కలైన ఐఏఎస్ సాధించాలనేది జీవిత లక్ష్యమని రేంవత్ చెప్పాడు.