
బాధ్యతగా స్వచ్ఛత పాటించాలి
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
చుంచుపల్లి: ప్రతీ పౌరుడు బాధ్యతగా స్వచ్ఛత పాటించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఆవరణలో శ్రమదానం నిర్వహించారు. కలెక్టర్‌తోపాటు అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు విశ్వవిద్యాలయ ఆవరణలో గడ్డి, పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ మాట్లాడుతూ ఇంటి నుంచి సమాజం వరకు ప్రతి ఒక్కరూ పరిశుభ్రతపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడవేయొద్దని అన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతేనని పేర్కొన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో నాగలక్ష్మి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, మున్సిపల్ కమిషనర్ సుజాత, మైనింగ్ ఏడీ దినేష్, గ్రౌండ్ వాటర్ ఏడీ రమేష్, మెప్మా పీడీ రాజేష్, ఉద్యోగులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.