ఎనిమిది గంటలపాటు రైతుల నిరసన
బూర్గంపాడు: యూరియా సరఫరాలో జరుగుతున్న జాప్యంపై రైతులు కన్నెర్రజేశారు. గురువారం మండల పరిధిలోని నాగినేనిప్రోలు సొసైటీ గోదాంలో ఐదు టన్నుల యూరియా దిగుమతి, మిగతా యూరియా ను మణుగూరు తరలిస్తుండగా లారీని రైతులు అడ్డుకున్నారు. నాగినేనిప్రోలు రెవెన్యూ పరిధిలో నాలుగువేల ఎకరాలకు పైగా వ్యవసాయ భూములుంటే ఇప్పటివరకు ఎన్ని యూరి యా బస్తాలు ఇచ్చారని, దిగుమతి చేసిన 120 బస్తాల యూరియాను ఎంతమందికి ఇస్తారని ప్రశ్నించారు.
సొసైటీ సిబ్బంది కూడా యూరియా పంపిణీలో వివక్ష చూపుతున్నారని, పరపతి ఉన్న రైతులకే ఇస్తున్నారని ఆరోపించారు. ఏ రైతుకు ఎంత యూరియా ఇచ్చారో లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. రెండునెలలుగా తిరుగుతున్నా యూరియా మాత్రం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 8 గంటలపాటు లారీని అడ్డుకోగా, సొసైటీ సీఈఓ, వ్యవసాయ అధికారులు పలుమార్లు రైతులతో మాట్లాడారు.
మణుగూరుకు వచ్చిన యూరియాను ఇక్కడ దిగుమతి చేయటం అసాధ్యమని, ఒకట్రెండు రోజుల్లో 20 టన్నుల యూరియాను నాగినేనిప్రోలులో దిగుమతి చేయిస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు. దీంతో లారీని అధికారులు మణుగూరు పంపించారు.

యూరియా లారీ అడ్డగింత