భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి సన్నిధిలో దేవీ శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా రెండో రోజైన బుధవారం శ్రీ లక్ష్మీతాయారమ్మవారు సంతానలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సంతాన అవరోధాలు తొలగించడంతో పాటు సుఖ సంతోషాలు ప్రసాదించాలని భక్తులు వేడుకున్నారు. ఈ సందర్భంగా ఉదయం అమ్మవారికి ప్రత్యేక స్నపన తిరుమంజనం, ప్రత్యేక పూజలు చేయగా, మధ్యాహ్నం సామూహిక కుంకుమార్చన గావించారు. మహిళా భక్తులు భారీగా పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాగా, చిత్రకూట మండపంలో జరుగుతున్న శ్రీరామాయణ పారాయణోత్సవాల్లో భాగంగా వేద పండితులు, అర్చకులు అయోధ్య కాండ పారాయణం చేశారు.
నేడు గజలక్ష్మీ అలంకరణలో..
‘లక్ష్మీః దివ్యైః గజేంద్రై మణిగణఖచితైః స్నాపితా హేమకుంభై’ అని కీర్తించారు పూర్వాచార్యులు. ఈ అమ్మను ఆరాధిస్తే అధికారము, మహా సంపద కలుగుతాయని శాస్త్రం చెబుతోంది. గజలక్ష్మిని ఆరాధించే దేవేంద్రుడు త్రైలోకాధిపత్యాన్ని సాధించాడని, ఆ అమ్మను పూజిస్తే చెదరని అఽధికారం, తరగని సంపద కలుగుతాయని పండితులు అంటున్నారు.
శాస్త్రోక్తంగా రామయ్య నిత్యకల్యాణం
శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక బేడా మండపంలో బుధవారం వైభవంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సంతానలక్ష్మీ నమో నమః