
భద్రాద్రిలో రాతి నిర్మాణాలు చేపట్టాలి
దేవస్థాన వైదిక బృందం సూచన
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో చేపట్టే మాస్టర్ ప్లాన్‌లో భాంగంగా రాతి కట్టడాలతో నిర్మించాలని బుధవారం ఆర్కిటెక్ సూర్యనారాయణ మూర్తికి దేవస్థాన వైదిక కమిటీ సభ్యులు సూచించారు. దేవస్థానం క్యాంప్ కార్యాలయంలో వైదిక సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆలయ అభివృద్ధి పనులపై పలు సూచనలు చేశారు. ప్రధాన ఆలయంలో మార్పులు చేయకుండా ప్రాకార మండపం, యాగశాలలను పున్నర్మించాలని తెలిపారు. అలాగే ఆలయం చుట్టూ ప్రధాన రహదారులను విస్తరించి నలువైపులా స్వామివారి రథం తిరిగేలా మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆర్కిటెక్ సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ.. గతంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచనలతో పాటు దేవస్థాన వైదిక సిబ్బంది అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తామని తెలిపారు. సమావేశంలో ఈఓ దామోదర్‌రావు, ఏఈఓలు శ్రావణ్‌కుమార్, భవాని రామకృష్ణ, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు (రామం), ఉప ప్రధానార్చకులు అమరవాది గోపాల కృష్ణమాచార్యులు, కోటి రామస్వరూప్, వేద పండితులు గుదిమెళ్ల మురళీ కృష్ణమాచార్యులు, రామాయణ పారాయణదారు ఎస్టీజీ కృష్ణమాచార్యులు, అసిస్టెంట్ ఇంజనీర్ అజయ్, సీసీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.