
కొంత ఊరట..
విలాస వస్తువులపై బాదుడు
పేద, మధ్య తరగతి ప్రజలకు
ఉపశమనం
జీవిత, ఆరోగ్య బీమాతో పాటు
ఔషధాల ధరల్లో మార్పులు
ఆఫర్లతో హడావుడి చేస్తున్న షోరూంలు
వ్యాపార వృద్ధికి తోడ్పాటు
ఖమ్మంగాంధీచౌక్: వస్తు సేవా పన్ను (జీఎస్టీ)ల్లో వచ్చిన మార్పులు పేద, మధ్య తరగతి వర్గాలకు ప్రయోజనం కలిగించేదిగా ఉందని పలువురు చెబుతున్నారు. వివిధరకాల వస్తువులపై శ్లాబ్‌లను జీఎస్టీ కౌన్సిల్ 2.0 పేరిట మార్పు చేసింది. కేంద్ర ప్రభుత్వం 2017లో పరోక్ష పన్ను విధానాలను తొలగించి జీఎస్టీని రూపొందించి అమలు చేసింది. వివిధరకాల వస్తువులకు జీఎస్టీ శ్లాబ్‌లను విధించింది. ఇప్పుడు జీఎస్టీ కౌన్సిల్ మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఉన్న 12 శాతం, 28 శాతం పన్ను రేట్లను తొలగించారు. ఆ స్థానంలో 5, 18, 40 శా తం శ్లాబ్‌లు అమలు చేయనున్నారు. దీంతో నిత్యా వసరాలపై పన్నులభారం తగ్గనుండగా, విలాసవంతమైన వస్తువుల ధరలు పెరగనున్నాయి.
ధర తగ్గిన కిరాణా సరుకులు
గతంలో 12 శాతం, 18 శాతం 28 శాతం వరకు శ్లాబ్ రేట్లతో ఉన్న పలు రకాల సరుకులు 5 శాతానికి తగ్గాయి. వెన్న, నెయ్యి, పాలు వంటివి 12.5 శాతం నుంచి 5 శాతానికి, బిస్కెట్లు, కేక్‌లు వంటివి 18 శాతం నుంచి 5 శాతానికి, ఆహార పదార్థాలతో పాటు జ్యూస్, మిల్క్ డ్రింక్స్ వంటివి 28 శాతం నుంచి 5 శాతానికి తగ్గాయి. 375 రకాల ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. టీవీల(సైజును బట్టి)పై ఉన్న 28 శాతం జీఎస్టీని 18 శాతం కన్నా తక్కువకు, సిమెంట్, ఇతర బిల్డింగ్ మెటీరియల్‌కు జీఎస్టీని తగ్గించారు.
బీమాకు మినహాయింపు
జీవిత, ఆరోగ్య బీమాలకు జీఎస్టీ కౌన్సిల్ పూర్తిగా పన్నుల మినహాయింపు కలిగించడంతో పాలసీ ప్రీమియం ధరలు తగ్గుతాయి. ఇప్పటి వరకు 18 శాతం జీఎస్టీ అమలులో ఉంది. సింగిల్ ప్రీమియం, బీమా రక్షణ చార్జీలపై కూడా జీఎస్టీ మినహాయింపు ఇచ్చారు. ఔషధాలపై జీఎస్టీ తగ్గించారు. గుండె జబ్బులు, కేన్సర్, జన్యు పరమైన వ్యాధులకు సంబంధించిన మందులపై జీఎస్టీని పూర్తిగా మినహా యించగా, 12 శాతం పరిధిలో ఉన్న పలు రకాల ఔషధాల శ్లాబ్ రేట్‌ను 5 శాతానికి తగ్గించారు.
విలాసవంతమైన పలు రకాల వస్తువులపై జీఎస్టీ శ్లాబ్‌ను అమాంతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సిగరెట్లు, గుట్కా, పాన్‌మసాలా, నికోటిన్ ఉత్పత్తులు 28 శాతం నుంచి 40 శాతానికి పెంచారు. కార్బొనేటెడ్, ఎనర్జీ, కెఫిన్ ఆధారిత డ్రింక్స్‌పై జీఎస్టీ 40 శాతానికి పెంచారు. లాటరీ టికెట్లు, కేసినో సేవలు, ఆన్‌లైన్ గేమింగ్‌పై పన్ను రేట్లను 40 శాతానికి పెంచారు. కార్లలో 1500 సీఈసీ కన్నా అధిక సామర్థ్యం ఉన్న వాటికి ఇకపై 40 శాతం జీఎస్టీ అమలవుతుంది. మోటారు సైకిల్ వాహన ధరలు కొంత మేర తగ్గనున్నా యి. కాగా, జీఎస్టీ తగ్గింపుతో సామగ్రి, వాహనాలు, బ్రాండెడ్ దుస్తుల ధరలు తగ్గాయంటూ వివిధ కంపెనీల షోరూంల వద్ద ఫ్లెక్సీలు కట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దసరా సమీపిస్తుండడంతో కొనుగోళ్లు పెరగనుండగా.. జీఎస్టీ తగ్గింపుతో మార్కెట్ ఊపందుకుంటుందనే భావన వ్యక్తమవుతోంది.
నిత్యావసరాలపై
జీఎస్టీ తగ్గింపు
జీఎస్టీలో శ్లాబ్‌ల మార్పు మంచి పరిణామం. చిన్న పరిశ్రమలు, చిరు వ్యాపారాలకు ప్రయోజనం. వ్యాపార వృద్ధి జరుగుతుంది. 12 శాతం, 28 శాతం శ్లాబ్‌లను తొలగించి 5 శాతం శ్లాబ్‌లను విధించటం ద్వారా ధరలు దిగివచ్చే అవకాశం ఉంది. చిరు వ్యాపారాలు పుంజుకునే అవకాశం ఉంది. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.
–చిన్ని కృష్ణారావు,
చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, ఖమ్మం

కొంత ఊరట..

కొంత ఊరట..