
చేప పిల్లల ధరలు ఖరారు
● ముగ్గురు కాంట్రాక్టర్ల ద్వారా చేప పిల్లల పంపిణీకి నిర్ణయం ● పెద్ద చేప పిల్ల రూ.1.70, చిన్న చేప పిల్ల 68 పైసలుగా నిర్ణయం
ఖమ్మంవ్యవసాయం: చేప పిల్లల ధరలను నిర్ణయించారు. జిల్లాలో చేప పిల్లల పంపిణీకి ఏడుగురు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖాలు చేశారు. నిబంధనల మేరకు ఆయా కాంట్రాక్టర్ల చేప పిల్లల అక్వాఫామ్ లు, హేచరీస్‌లను జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్, పశుసంవర్థక, పశువైద్య సహాయ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ ఎంఏ రాజు, చీఫ్ ప్రమోటర్ మామిడి వెంకటేశ్వర్లుతో కూడిన బృందం పరిశీలించింది. ఈ పరిశీలన ద్వారా ముగ్గురు కాంట్రాక్టర్లు నిర్వహించే హేచరీస్‌లను ఎంపిక చేశారు. జస్వంత్ ఆక్వాఫామ్, మచిలీపట్నం, నరేంద్ర హేచరీస్ ఆకివీడు, పశ్చిమగోదావరి జిల్లా, సత్యకృష్ణ ఆరేటి కంపెనీ, కాళ్ల బీమవరం, పశ్చిమ గోదావరి జిల్లాలను చేప పిల్లల పంపిణీకి ఎంపిక చేశారు. ఈ మూడు కంపెనీల ఫైనాన్షియల్ బిడ్‌లను పథకం డిప్యూటీ చైర్మన్, జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సమక్షంలో ఓపెన్ చేశారు.
ధరలు ఇలా..
ఉచిత చేప పిల్లల పథకం కింద పంపిణీ చేసే చేప పిల్లలకు కాంట్రాక్టర్లు కోడ్ చేసిన వాటిలో తక్కువ ధరలను కమిటీ నిర్ణయించింది. 80–100 మి.మీ ఓక్కో చేప పిల్లకు రూ.1.70, 35 – 40 మి.మీ ఒక్కో చేప పిల్లకు 68 పైసల చొప్పున ఖరారైంది. ఈ ఏడాది జిల్లాలో 882 జలాశయాల్లో చేప పిల్లల విడుదలకు మత్స్యశాఖ ప్రణాళిక రూపొందించింది. అందులో భాగంగా 80–100 మి.మీల చేప పిల్లలు 2.11 కోట్లు కాగా, 35–40 మి.మీల చేప పిల్లలు 1.38 కోట్లను పంపిణీ చేయనున్నారు. ఈ పిల్లలకు సుమారు రూ.4 కోట్ల వరకు కేటాయించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద కట్ల, రోహు, బంగారుతీగ రకాల చేప పిల్లలను ఎంపిక చేశారు.
ప్రభుత్వం నిర్ణయించిన సమయంలో పంపిణీ
రాష్ట్రంలో కెల్లా ఖమ్మం జిల్లాలో చేప పిల్లల టెండర్ల ప్రక్రియ, ఫైనాన్సియల్ బిడ్ వంటి ప్రక్రియలు పూర్తయ్యాయి. ఈ ప్రక్రియల నివేదికలను జిల్లా యంత్రాంగం రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్‌కు పంపించారు. ఇప్పటికే జలాశయాల్లో సమృద్ధిగా నీరుంది. చేప పిల్లల విడుదలకు అనుకూలంగా ఉంది. ప్రభుత్వం చేప పిల్లల పంపిణీకి, జలాశయాల్లో విడుదలకు అనుమతులు ఇస్తే జిల్లాలో ఈ పంపిణీ ప్రక్రియను వెంటనే చేపట్టే అవకాశం ఉందని జిల్లా మత్స్యశాఖ అధికారి శివప్రసాద్ తెలిపారు.