
హత్య కేసు నిందితుల అరెస్ట్
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం గణేశ్‌టెంపుల్ ఏరియాలో ఈ నెల 22వ తేదీన జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ వివరాలు వెల్లడించారు. గణేశ్‌టెంపుల్ ఏరియాలో గుబ్బల రాంమోహన్‌రావు (62) ఇంట్లో రాత్రి టిఫిన్ చేస్తున్న సమయంలో రామవరానికి చెందిన మహ్మద్ షాహీర్ బండరాయిలను పగలగొట్టే సుత్తితో ఇంట్లోకి ప్రవేశించాడు. రాంమోహన్‌రావుపై దాడి చేయగా.. ఆయన భయంతో బయటకు పరుగెత్తడంతో షాహీర్ కూడా బయటకు వెళ్లి తలపై సుత్తితో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం డ్రెయినేజీలో సుత్తి పడేసి.. అక్కడే వేచి ఉన్న వాసంపల్లి వంశీ ద్విచక్రవాహనంపై రామవరానికి వెళ్లాడు. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా నిందితులు మహ్మద్ షాహీర్, వాసంపెల్లి వంశీ పోలీసులు పట్టుకున్నారు. అయితే, ఓ వివాహితతో అక్రమ సంబంధం కారణంగా షాహీర్.. రాంమోహన్‌రావును చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. సదరు వివాహితపై కూడా కేసు నమోదు చేస్తామని, వీరందరిని గురువారం రిమాండ్‌కు తరలిస్తామని డీఎస్పీ వెల్లడించారు. కాగా, ఇద్దరు నిందితులపై రౌడీషీట్ తెరుస్తామని ఆయన వివరించారు. కార్యక్రమంలో సీఐలు శివప్రసాద్, కరుణాకర్, ప్రతాప్, ఎస్‌ఐ విజయ, పోలీసులు పాల్గొన్నారు.