
సస్యరక్షణ చర్యలతో తెగుళ్ల నివారణ
చింతకాని: పంటలకు ఆశించే చీడపీడలు, తెగుళ్ల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలుచేపట్టాలని మధిర వ్యవసాయ సహాయ సంచాలకుడు విజయ్ చంద్ర పేర్కొన్నారు. చింతకానిలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు ఆశించిన వరి పొలాలను బుధవారం పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం వరిలో ఆకు ఎండు తెగులు ఆశిస్తున్నందున కొంతమేర నివారణకు ప్లాంటమైసిన్ లేదా పోషమైసిన్ 0.2 గ్రాములు లేదా అగ్రిమైసిన్ 0.4 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. అలాగే వరిపంట పూతదశలో ఉన్నప్పుడు కాపర్ శిలీంద్రనాశినులను పిచికారీ చేయొద్దని తెలిపారు. వరిపంటకు ఆఖరి దశగా పొటాష్ ఎరువును ఎకరానికి 15–20 కేజీలు వేయాలని, పొలంలో పాత నీరు తీసి కొత్త నీరు పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయధికారి సోములపల్లి మానస, వ్యవసాయ విస్తీర్ణాధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.