
గ్రామాలు అభివృద్ధి సాధించేలా..
దుమ్ముగూడెం: మారుమూల ఆదివాసీ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారానికి ఆది కర్మయోగి అభియాన్ పథకం ప్రవేశపెట్టామని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. మంగళవారం మండలంలోని సింగవరం, నడికుడి గ్రామాల్లో ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆది సేవ కేంద్రం ప్రారంభించి అధికారులు, గ్రామస్తులతో కలిసి మౌలిక వసతుల కల్పనపై ఢిల్లీ నుంచి వచ్చిన పర్యవేక్షకులు ప్రదీప్‌కుమార్‌సింగ్‌తో కలిసి పీఓ చర్చించారు. 2030 వచ్చేసరికి పథకంలో భాగంగా అన్ని గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయని, అందుకు ప్రతి గ్రామంలో వలంటీర్, సహయోగులను నియమించారని, వారు ప్రతి శనివారం సమస్యలపై చర్చించి, ప్రతిపాదనలు తయారు చేస్తారన్నారు. చివరి శనివారం అధికారుల సమక్షంలో ప్రతిపాదనలు అందజేస్తారని చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో ఉద్దీపకం వర్క్ బుక్ ప్రవేశపెట్టారని, 10వ తరగతి పాస్ అయిన విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ ప్రవేశపెట్టామని వెల్లడించారు. అనంతరం సింగవరం, నడికుడి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గ్రామస్తులు వివ రించారు. ప్రదీప్‌కుమార్‌సింగ్ మాట్లాడుతూ.. ఈ పథకం కింద అన్ని శాఖల అధికారులు గ్రామాల్లో సమస్యలు తెలుసుకొని ప్రతిపాదనలు సిద్ధం చేసి, ఢిల్లీకి పంపించి నిధులు తెప్పించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్, స్పెషల్ ఆఫీసర్ అశోక్‌కుమార్, ఎంపీఓ రామకృష్ణ, డీఎంటీలు రాంబాబు, మధువన్, జగదీశ్, డీఎంహెచ్‌ఓ సైదులు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ చైతన్య, సీడీపీఓ జ్యోతి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ అనసూయ తదితరులు పాల్గొన్నారు.తొలుత, పీఓ, పర్యవేక్షకులు రాహుల్, ప్రదీప్‌కుమార్‌సింగ్‌కు మహిళలు, చిన్నారులు బతుకమ్మ ఆటపాటలతో స్వాగతం పలికారు.
అమ్మవారికి పీఓ రాహుల్ పూజలు
భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణం శాంతినగర్ కాలనీలోని శ్రీ లలిత పరమేశ్వరి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఐటీడీఏ పీఓ రాహుల్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రెండో రోజైన మంగళవారం శ్రీగాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
‘ఆది కర్మయోగి అభియాన్’ ప్రారంభం