
ఫుట్‌పాత్‌లే పూల కొట్లు!
దీపావళి తరహాలో..
జిల్లా వ్యాప్తంగా రోడ్ల పక్కనే క్రయవిక్రయాలు ఇబ్బంది పడుతున్న చిరువ్యాపారులు, వాహనదారులు పండగ వస్తే పట్టణాల్లో తప్పని ట్రాఫిక్ చిక్కులు
ప్రతి నెలా పండగే..
జనవరిలో వచ్చే సంక్రాంతి మొదలు డిసెంబర్ 31 అర్ధరాత్రి నిర్వహించే న్యూఇయర్ వేడుకల వరకు ప్రతీ నెల కనీసం ఒక్క పండగైనా వస్తుంది. ఈ సందర్భంగా ఆయా దేవతలను ఆరాధించేందుకు ప్రతిమలు, పూజా సామగ్రి, బొమ్మలు, దీపాలు, పూలు తదితర వస్తువులు అవసరం. ఇవన్నీ సాధారణ మార్కెట్‌లో నిత్యం లభించేవి కావు. అప్పటికప్పుడు చిరు వ్యాపారులు ఈ వస్తువులను సేకరించి ప్రజలకు అందుబాటులోకి తెస్తుంటారు. అయితే ఈ క్రయవిక్రయాలు జరిపేందుకు వీలుగా అనువైన స్థలం చూపించడం, అక్కడ కనీస వసతులు కల్పించడంపై జిల్లాలోని స్థానిక సంస్థలు దృష్టి పెట్టడం లేదు. ఇల్లెందు, మణుగూరు, భద్రాచలం, అశ్వారావుపేట వంటి పట్టణాలతో పాటు కొత్తగూడెం కార్పొరేషన్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
జిల్లా కేంద్రంలో మరీ దారుణం..
పండగలు, ఇతర ఉత్సవాల సమయంలో జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో బస్టాండ్ – రైల్వేస్టేషన్ మధ్య ప్రధాన రహదారికి ఇరువైపులా చిరువ్యాపారులు అమ్మకాలు సాగిస్తున్నారు. బతుకమ్మ పండగ వస్తే పూలు, దీపావళికి బొమ్మలు, వినాయకచవితి రోజున గరిక, వెలగపండ్లు, శివరాత్రి సమయంలో కందమూలాలు, నూతన సంవత్సరం సందర్భంగా కేక్‌లు ఇక్కడే విక్రయిస్తుంటారు. 500 మీటర్ల నిడివి గల ఈ రోడ్డు ‘ఎస్’ ఆకారంలో ఒంపుతో ఉంటుంది. పైగా అండర్ బ్రిడ్జి కూడా ఉంది. ఇలాంటి ఒంపులు తిరిగిన రోడ్ల వద్ద వాహనాలు ఆపకూడదు. కానీ చిరువ్యాపారులు ఫుట్‌పాత్‌లనే అడ్డాలుగా చేసుకుని అమ్మకాలు సాగిస్తుండగా కొనుగోలుదారులు అక్కడే వాహనాలు ఆపుతున్నారు. ఫలితంగా ప్రతీ పండగ సమయంలో ఇక్కడ ఇక్కట్లు తప్పడం లేదు.
ఇతర పట్టణాల్లోనూ ఇవే ఇబ్బందులు..
కొత్తగూడెం కార్పొరేషన్ తరహాలో అశ్వారావుపేట, ఇల్లెందు, మణుగూరు పురపాలికలు, భద్రాచలం వంటి టెంపుల్ టౌన్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రెయినేజీలపై నిర్మించిన ఫుట్‌పాత్‌లే పూజా సామగ్రి క్రయవిక్రయ కేంద్రాలుగా నిలుస్తున్నాయి. మరోవైపు ఇక్కడ అమ్మకాలు సాగించేందుకు పల్లెల నుంచి చిరువ్యాపారులు కుటుంబ సమేతంగా వస్తుంటారు. అర్ధరాత్రి నుంచే ఫుట్‌పాత్‌లపై కవర్లు వేసుకుని స్థలాలు ఆపుతుంటారు. రాత్రంతా అక్కడే ఉండే వ్యాపారులు, మహిళలు, బాలికలు తమ కనీస అవసరాలకు చాటు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతీ నెల ఈ తతంతగం జరుగుతున్నా పరిష్కారం చూపించే నాథుడు లేడు.
పండగ రోజు తెల్లవారుజామునే వచ్చినా పూలు అమ్మేందుకు రోడ్డు పక్కన స్థలం దొరకదు. అందుకే ముందు రోజు రాత్రే వచ్చి ఇక్కడ ఫుట్‌పాత్‌పై జాగ చూసుకోవాలి. రాత్రంతా రోడ్ల పక్కనే ఉండడం ఇబ్బందిగా ఉంది.
– కృష్ణవేణి, వ్యాపారి, సుజాతనగర్
రోడ్ల పక్కన బండి ఆపి పూజా సామగ్రి కొనే సమయంలో కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. మంచి నాణ్యమైన వస్తువులు మా దగ్గర ఉన్నా, ట్రాఫిక్ ఇబ్బంది కారణంగా ఏదో ఒక వస్తువు కొనుక్కుని వెళ్తున్నారు. పార్కింగ్ సౌకర్యం ఉన్న చోట అమ్మకాలకు అవకాశం కల్పిస్తే అందరికీ బాగుంటుంది.
– గణేశ్, వ్యాపారి, రాఘవాపురం
దీపావళి పండగ సమయంలో బాణ సంచా అమ్మేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు. ఏదైనా స్థలంలో షెడ్లు ఏర్పాటు చేయడంతో పాటు పార్కింగ్ సౌకర్యం ఉండేలా చూస్తారు. జిల్లాలోని ప్రతీ మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన మార్కెట్‌కు సమీపంలో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ఇక్కడ మోడల్ మార్కెట్ నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి. కానీ ఇప్పటికీ పూర్తి కాలేదు. కనీసం ఇలాంటి స్థలాల దగ్గరైనా పర్విదినాల్లో ఉపయోగించే వస్తువులు అమ్మకాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. ఇలా చేయడంతో ఇటు చిరువ్యాపారులతో పాటు అటు భక్తులు, పట్టణవాసులకు ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోతాయని అంటున్నారు.
పూజా సామగ్రి అమ్మకాలూ ఇక్కడే

ఫుట్‌పాత్‌లే పూల కొట్లు!