‘డ్వాక్రా’ డబ్బు మాయం.. | - | Sakshi
Sakshi News home page

‘డ్వాక్రా’ డబ్బు మాయం..

Sep 24 2025 5:16 AM | Updated on Sep 24 2025 5:16 AM

‘డ్వాక్రా’ డబ్బు మాయం..

‘డ్వాక్రా’ డబ్బు మాయం..

● చేతివాటం ప్రదర్శించిన బుక్‌ కీపర్‌ ● మహిళా సంఘాలకు చెందిన రూ.7లక్షలు సొంత అవసరాలకు.. ● ఐకేపీలో వెలుగులోకి వస్తున్న వరుస అక్రమాలు

● చేతివాటం ప్రదర్శించిన బుక్‌ కీపర్‌ ● మహిళా సంఘాలకు చెందిన రూ.7లక్షలు సొంత అవసరాలకు.. ● ఐకేపీలో వెలుగులోకి వస్తున్న వరుస అక్రమాలు

బూర్గంపాడు: ఇందిరా క్రాంతి పథంలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఆరు నెలల క్రితం సీ్త్ర నిధి రుణాలను పెద్ద మొత్తంలో సీసీ కాజేసిన వ్యవహారం కొలిక్కి రాకముందే వరుస అక్రమాలు బయట పడుతున్నాయి. ఎస్‌హెచ్‌జీ సభ్యులు బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలను సారపాకకు చెందిన బుక్‌ కీపర్‌ పెద్ద మొత్తంలో స్వాహా చేసినట్లు సోమవారం ఆరోపణలు వచ్చాయి. ఓ ఎస్‌హెచ్‌జీ సభ్యులు 9 నెలలుగా చెల్లించిన పొదుపు, బ్యాంకు రుణాలకు సంబంధించిన నగదును బ్యాంకుకు చెల్లించకుండా తన సొంత అవసరాలకు వాడుకున్నట్లు తేలింది. 9 నెలలుగా గ్రూప్‌ సభ్యులు పొదుపు, లోన్‌ డబ్బులు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు గ్రూప్‌ లీడర్‌ను ప్రశ్నించగా.. తాము క్రమం తప్పకుండా పొదుపు, రుణం చెల్లిస్తున్నామని తెలిపారు. దీంతో రికార్డులు పరిశీలించాక బుక్‌ కీపర్‌ను గ్రూప్‌ సభ్యులు నిలదీయగా అసలు విషయం తేలింది. ఆమెకు ఇచ్చిన రూ. 5.96 లక్షలతో పాటు మరో గ్రూప్‌ సభ్యులు చెల్లించిన రూ 1.25లక్షల పొదుపు నగదును కూడా సొంతానికి వాడుకున్నట్లు వెల్లడైంది. దీంతో గ్రూప్‌ సభ్యులు ఆమె ఇంటికి వెళ్లి ప్రశ్నించగా సభ్యులతో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఐకేపీ ఏపీఎం హేమంతిని మంగళవారం బుక్‌ కీపర్‌ను, గ్రూప్‌ సభ్యులను కార్యాలయానికి పిలిచి విచారించగా రూ. 7లక్షలకు పైగా నగదును తన సొంత అవసరాలకు వాడుకున్నట్లు అంగీకరించింది. కొంత సమయం ఇస్తే ఆ నగదు తిరిగి చెల్లిస్తానని సభ్యులకు ఒప్పంద పత్రం రాసిచ్చింది. ఈ బుక్‌ కీపర్‌ పరిధిలోని మిగతా గ్రూప్‌ సభ్యులు కూడా తమ బ్యాంకు లావాదేవీలను మంగళవారం పరిశీలించుకున్నారు. కొన్ని గ్రూపులకు చెందిన నగదు చెల్లింపుల్లో కూడా ఆమె బాగానే చేతివాటం ప్రదర్శించినట్లు చర్చ సాగుతోంది. మొత్తంగా రూ.60 లక్షల వరకు బుక్‌ కీపర్‌ తన సొంత అవసరాలకు వాడుకున్నట్లు ప్రచారం సాగుతుండగా ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేసి వాస్తవాలను వెలికితీస్తామని ఏపీఎం హేమంతిని తెలిపారు.

డ్వాక్రా సభ్యుల్లో ఆందోళన..

బూర్గంపాడు ఐకేపీ కార్యాలయంలో వరుసగా అక్రమాలు వెలుగు చూస్తుండటంతో డ్వాక్రా సంఘాల సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఆరు నెలల క్రితం ఓ సీసీ సీ్త్రనిధి రుణాల రికవరీలో భారీగా అవినీతికి పాల్పడ్డాడు. కృష్ణసాగర్‌, లక్ష్మీపురం, నకిరిపేట, సారపాక గ్రామాలకు చెందిన గ్రూపుల నుంచి సీ్త్ర నిధి రుణాల రికవరీకి సంబంధించి రూ. 45 లక్షల వరకు స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సదరు సీసీని సస్పెండ్‌ చేసి నగదు రికవరీకి ఉన్నతాధికారులు ఆదేశించారు. అయితే ఈ వ్యవహారంలో సీసీని సస్పెండ్‌ చేసిన అధికారులు.. రికవరీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఘటన మరువక ముందే బూర్గంపాడులోని గౌతమీపురానికి చెందిన డ్వాక్రా గ్రూపులకు ఇచ్చిన సీ్త్రనిధి రుణాల చెల్లింపుల్లోనూ అక్రమాలు జరిగాయని బాధితులు ఐకేపీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ వ్యవహారంపై కూడా కలెక్టర్‌ విచారణకు ఆదేశించి, నివేదికలను అందించాలని సెర్ప్‌ అధికారులకు సూచించారు. ఇంతలోనే సారపాకలో బుక్‌ కీపర్‌ చేతివాటం బయటపడింది. బ్యాంకులో తీసుకునే రుణాలకు కూడా బుక్‌ కీపర్‌లు, సీసీలు గ్రూప్‌ సభ్యుల నుంచి భారీగానే డబ్బు వసూలు చేస్తున్నారనే ప్రచారం సాగుతున్నా.. వివరాలు వెల్లడించేందుకు సభ్యులు భయపడుతున్నారు. బూర్గంపాడు ఐకేపీ పరిధిలో జరుగుతున్న అక్రమాలపై డీఆర్‌డీఏ, సెర్ప్‌ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలని సభ్యులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement