
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
తొలిరోజు ఆదిలక్ష్మి అలంకరణలో దర్శనం
నేడు సంతానలక్ష్మిగా లక్ష్మీతాయారమ్మవారు
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజున లక్ష్మీతాయారమ్మవారు ఆదిలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. చతుర్భుజాలతో పై రెండు చేతుల్లో పద్మాలను ధరించి వరద – అభయ హస్తాలతో ఉన్న ఆదిలక్ష్మి అమ్మవారిని భక్తులు దర్శించుకుని తరించారు. మధ్యాహ్నం సామూహిక కుంకుమార్చన నిర్వహించగా పలువురు మహిళా భక్తులు పాల్గొన్నారు. కాగా, ఉదయం చిత్రకూట మండపంలో అర్చకులు శ్రీరామాయణ పారాయణ మహోత్సవాలు నిర్వహించారు. తొలిరోజు బాలకాండ పారాయణం గావించారు. అనంతరం స్వామివారిని సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చి హారతి, నివేదన సమర్పించారు. శ్రీరామ పారాయణానికి స్వచ్ఛందంగా వచ్చిన భక్తులకు, పండితులకు దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పించారు.
నేడు సంతానలక్ష్మిగా దర్శనం..
‘అఖిల జగన్మాతరం, అస్మన్మాతరం’ అంటూ సర్వం కీర్తించే సంతానలక్ష్మిగా లక్ష్మీతాయారు అమ్మవారు బుధవారం దర్శనం ఇవ్వనున్నారు. సకల చరాచర జగత్తు ఆ అమ్మ సంతానమని, అందుకే ఆమె సంతానలక్ష్మి అని, ఈ రూపంలో ఉన్న అమ్మను ఆరాధిస్తే సంతాన అవరోధాలు తొలగుతాయని పండితులు తెలిపారు.
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం..
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చిన అర్చకులు.. మొదట విశ్వక్సేన పూజ, పుణ్యావాచం చేశారు. ఆ తర్వాత స్వామివారికి కంకణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం