
పత్తి కొనుగోళ్లలో పారదర్శకత ఉండాలి
మాదక ద్రవ్యాల నియంత్రణకు
చర్యలు చేపట్టాలి
కలెక్టర్ జితేష్ వి పాటిల్
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరగాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం పత్తి కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో 1,72,937 ఎకరాల్లో పత్తిసాగు చేశారని, 26,54,140 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారని చెప్పారు. ఈ సంవత్సరం పత్తి మద్దతు ధర రూ 8,110 ప్రభుత్వం నిర్ణయించిదని తెలిపారు. పత్తి కొనుగోళ్లకు ఆరు సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశామని, తూకంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని అన్నారు. జిల్లాలో ఉన్న వే బ్రిడ్జిలను తనిఖీ చేయాలని తూనికలు, కొలతల శాఖాధికారిని ఆదేశించారు. రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా చూడాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, వసతి, గోదాములు, తేమ పరీక్షించే యంత్రాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. పత్తి తీసిన తర్వాత తోటల్లోని కట్టెను బయోచార్ తయారీకి ఉపయోగించేలా రైతులకు అవగాహన కల్పించాలని మిల్లర్లకు సూచించారు. సమావేశంలో సీపీఓ సంజీవరావు, డీఏఓ బాబూరావు, మార్కెటింగ్ అధికారి నరేందర్, తూనికలు, కొలతల అధికారి మనోహర్, ఆర్టీఓ వెంకటరమణ పాల్గొన్నారు.
మాదక ద్రవ్యాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. డ్రగ్స్‌తో కలిగే నష్టాలపై విద్యాలయాలు, మోడల్ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. వాటికి బానిసైన వారిని గుర్తించి చికిత్స, కౌన్సిలింగ్ అందించేలా చర్యలు తీసుకోవాలని, డీ అడిక్షన్ సెంటర్ ద్వారా అవసరమైన చికిత్స అందించాలని సూచించారు. అటవీ శాఖాధికారులు తమ పరిధిలో గంజాయి సాగు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఆస్పత్రులు, మెడికల్ షాపుల్లో తనిఖీ చేయాలని డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌కు సూచించారు. రక్తదానంపై యువతకు అవగాహన కల్పించి రక్తదాన శిబిరాలు, అనీమియా పరీక్షలు నిర్వహించాలని, నర్సింగ్, ఎన్‌సీసీ శిక్షణ ద్వారా యువతకు మార్గనిర్దేశం చేయాలని అన్నారు. సమావేశంలో ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జానయ్య, డీఐఈఓ వెంకటేశ్వరరావు, డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.