
అసాంఘిక కార్యకలాపాల కట్టడిపై దృష్టి
దుమ్ముగూడెం/ బూర్గంపాడు : కోడిపందేలు, పేకాట ,బెట్టింగుల వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎస్పీ రోహిత్ రాజు సిబ్బందికి సూచించారు. మంగళవారం ఆయన దుమ్ముగూడెం, బూర్గంపాడు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాల కదలికలపై నిఘా పెంచాలని, చోరీల కట్టడికి కృషి చేయాలని చెప్పారు. అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి, నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో ‘నేను సైతం‘ కార్యక్రమంలో భాగంగా ప్రజలను భాగస్వాములను చేస్తూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌లలో పనిచేసే అధికారులు, సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సైబర్ నేరగాళ్ల మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలను అక్రమంగా రవాణా చేసే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.
సిబ్బందికి ఎస్పీ ఆదేశం