
కలెక్టరేట్‌లో బతుకమ్మ వేడుకలు
సూపర్‌బజార్(కొత్తగూడెం)/చుంచపల్లి: బతుకమ్మ సంబరాల్లో మూడో రోజైన మంగళవారం వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో వేడుకలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, ట్రైనీ కలెక్టర్ సౌరభ్‌శర్మ హాజరై మహిళా ఉద్యోగులతో కలిసి ఆడి, పాడారు. సంప్రదాయం ప్రకారం చామంతి, మందార, సీతమ్మజడ, రామబాణం వంటి పూలతో మూడంతరాల్లో బతుకమ్మను పేర్చి తామరపాత్రలో కళాత్మకంగా అలంకరించారు. మహిళా ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో బతుకమ్మను పూజించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని అన్నారు. ట్రైనీ కలెక్టర్ సౌరభ్‌శర్మ మాట్లాడుతూ.. ఇలాంటి పండుగలు ఉద్యోగుల మధ్య సఖ్యత, సామరస్య వాతావరణాన్ని పెంచుతాయని అన్నారు. వేడుకల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా, వైద్యశాఖ సిబ్బంది, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ