
సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ ఏర్పాటుకు స్థల పరిశీలన
చర్ల: మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న సీఆర్‌పీఎఫ్ 81వ బెటాలియన్‌కు సంబంధించి సీఆర్‌పీఎఫ్ ఐజీ విపుల్‌కుమార్ మంగళవారం స్థల పరిశీలన చేశారు. చర్లలోని సర్వే నంబర్ 117లో బెటాలియన్ ఏర్పాటుకు గతంలో పదెకరాల ప్రభుత్వ భూమిని కేటాయించగా.. తహసీల్దార్ ఎం.శ్రీనివాస్ నుంచి స్థల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ.. బెటాలియన్ ఏర్పాటుకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉందని, త్వరలోనే ఇంజనీరింగ్ అధికారులతో పర్యవేక్షించి నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. ఈ ప్రాంతంలో భద్రతా పరమైన అంశాలపై భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్‌తో చర్చించారు. కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్ 81 బెటాలియన్ సత్యనారాయణపురం కమాండెంట్ ముకేష్‌కుమార్, చర్ల సీఐ రాజువర్మ, ఎస్సైలు, నర్సిరెడ్డి, కేశవ్ తదితరులు పాల్గొన్నారు.