ఏదీ.. ఆనాటి జోష్‌ ! | - | Sakshi
Sakshi News home page

ఏదీ.. ఆనాటి జోష్‌ !

Sep 23 2025 7:31 AM | Updated on Sep 23 2025 7:57 AM

ఎక్కువ వైరెటీలు.. తక్కువ ధరలు

సంప్రదాయ మార్కెట్‌కు గడ్డు రోజులు

ఆన్‌లైన్‌, బడా మాల్స్‌ వైపే వినియోగదారుల మొగ్గు

ధరల సవరణపై మార్కెట్‌ వర్గాల దృష్టి

ధరల దగ్గరే పేచీ

మార్పు మొదలైంది

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి కార్మికులకు లాభాల బోనస్‌ ప్రకటించగానే సంప్రదాయ మార్కెట్‌లో ఒక్కసారిగా జోష్‌ వచ్చేది. అయితే కొన్నేళ్లుగా ఆన్‌లైన్‌ మార్కెట్‌, బడా షాపింగ్‌ మాళ్లు జిల్లాలో పాగా వేయడంతో ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. కాగా ఈ సారి ఆన్‌లైన్‌, బడామాల్స్‌కు దీటుగా తాము కూడా ధరల యుద్ధానికి సై అంటున్నాయి సంప్రదాయ మార్కెట్‌ వర్గాలు.

పది రోజుల ముందే..

దసరా పండగ వస్తోందంటే సంప్రదాయ మార్కెట్లు కొత్తకళ సంతరించుకునేవి. కొత్తగూడెంలో ఎంజీరోడ్డు, చిన్నబజార్‌, పెద్ద బజార్‌, భద్రాచలంలో యూబీ రోడ్డు, పాల్వంచలో శాస్త్రిరోడ్‌, ఇల్లెందులో ఆంబజార్‌, మణుగూరు మెయిన్‌రోడ్లలో షాపులన్నీ వినియోగదారులతో నిండిపోయేవి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు షాపుల యజమానులు రకరకాల ప్రయత్నాలు చేసేవారు. తాము అందిస్తున్న ఆఫర్లు, ప్రత్యేక బహుమతులు, లక్కీడ్రాకు సంబంధించిన వివరాలతో భారీ హోర్డింగులు ఏర్పాటు చేసేవారు. బ్యాండ్‌ ్‌ మేళాలు, విచిత్ర వేషధారణతో మనుషులను షాపుల ముందు ఉంచి హంగామా చేసేవారు. పండగకు పది రోజుల ముందు నుంచే ఈ పరిస్థితి కనిపించేది. అటువైపు వాహనాల్లో వెళ్లడం కష్టంగా ఉండేది. కానీ గత కొన్నేళ్లుగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఇటు వస్త్ర, అటు కిరాణా దుకాణాలు క్రమంగా ఆనాటి వైభవాన్ని కోల్పోతున్నాయి.

ధరల సవరణకు సై..

ఆన్‌లైన్‌ మార్కెట్‌, బడా షాపింగ్‌ మాళ్లతో పోల్చితే సంప్రదాయ మార్కెట్‌లో లభించే వస్తువుల ధరలు కొంత ఎక్కువగానే ఉంటున్నాయి. దీన్ని ఆసరా చేసుకుని వినియోగదారులను ఆకర్షించడం ద్వారా న్యూ ఏజ్‌ మార్కెట్‌ పుంజుకుంది. దీని దెబ్బకు నిన్నా మొన్నటి వరకు దుకాణాలు నిర్వహించే వ్యాపారులే ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పడు వారికి సరుకులు సరఫరా చేసే బడా వ్యాపార సంస్థలకు సైతం ఈ సెగ తాకింది. గతంలో వలె భారీగా ఆర్డర్లు రావడం తగ్గిపోయింది. దీంతో ఆన్‌లైన్‌ మార్కెట్‌కు పోటీగా ధరల యుద్ధానికి సంప్రదాయ మార్కెట్‌ వర్గాలు, హోల్‌సేల్‌ వ్యాపారులు సై అంటున్నారు. ఈసారి పండగ సీజన్‌లో ఆన్‌లైన్‌, బడాషాపింగ్‌ మాల్స్‌కు దీటుగా తాము కూడా పోటీలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాక జీవితంలో ఇంటర్నెట్‌ భాగమైంది. ఇంట్లోనే తీరికగా కూర్చుని వందల రకాల వస్తువులను సెర్చ్‌ చేసుకుని, ధరలను సరిపోల్చుకుని, ఆ వస్తువును వాడిన వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌ తెలుసుకుని షాపింగ్‌ చేయడం ఎక్కువైంది. కాలు బయట పెట్టకుండానే ఇంటి వద్దకే వస్తువలు రావడం మొదలైంది. మరోవైపు పెద్ద నగరాలకే పరిమితమైన బడా షాపింగ్‌ మాళ్లు జిల్లాలకూ వచ్చేశాయి. కిరాణా వంటి నిత్యావసరాలతో పాటు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ సరిపడ బట్టలు, బంగారం అమ్మే మాల్స్‌ కూడా వచ్చాయి. దీంతో సంప్రదాయ మార్కెట్‌కు వచ్చే వినియోగదారులు క్రమంగా తగ్గిపోతుండగా పండగ సీజన్‌లో కిటకిటలాడే బజార్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి.

‘బజార్‌’ దుకాణాలకు పండగ కళ వచ్చేనా ?

రెండేళ్ల క్రితం షూ కొనేందుకు దుకాణానికి వెళ్లా. ఎమ్మార్పీపై కొంత తగ్గించండి అని అడిగితే మా దగ్గర ఫిక్స్‌డ్‌ రేట్‌ అని షాపు యజమాని చెప్పాడు. అదే షూ మీద ఆన్‌లైన్‌లో మంచి డిస్కౌంట్‌ ఉంది. అప్పటి నుంచి క్రమంగా ఆన్‌లైన్‌లోనే కొనడం అలవాటైంది. ధరల విషయంలో ఆఫ్‌లైన్‌ మార్కెట్‌ వర్గాలు కొంత మారాల్సి ఉంది.

– కె.లక్ష్మణ్‌, వినియోగదారుడు, కొత్తగూడెం

కొన్నేళ్లుగా ఆన్‌లైన్‌, బడాషాపింగ్‌ మాల్స్‌ నుంచి మాకు తీవ్రమైన పోటీ ఎదురైంది. దీని ప్రభావం సంప్రదాయ మార్కెట్‌లో రిటైలర్‌ నుంచి తయారీదారు వరకు అందరిపైనా పడింది. అందుకే ఈసారి నాణ్యమైన వస్తువులు తక్కువ ధరలో అమ్మాలనే వ్యూహంతో ముందుకు వస్తున్నాం.

– మొరిశెట్టి భవానీ ప్రసాద్‌, వ్యాపారుల సంక్షేమ సంఘం కన్వీనర్‌, కొత్తగూడెం

ఏదీ.. ఆనాటి జోష్‌ !1
1/3

ఏదీ.. ఆనాటి జోష్‌ !

ఏదీ.. ఆనాటి జోష్‌ !2
2/3

ఏదీ.. ఆనాటి జోష్‌ !

ఏదీ.. ఆనాటి జోష్‌ !3
3/3

ఏదీ.. ఆనాటి జోష్‌ !

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement