
రీజియన్‌లో 6,376 మందికి లబ్ధి
సింగరేణి(కొత్తగూడెం) : గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సాధించిన రూ. 6,394 కోట్ల నికర లాభంలో 34 శాతం కార్మికులకు బోనస్ చెల్లించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దీంతో కొత్తగూడెం రీజియన్‌లోని 6,376 మంది కార్మికులకు లబ్ధి చేకూరనుంది. ఇల్లెందు ఏరియాలో 585 మందికి, కొత్తగూడెం కార్పొరేట్‌లో 1,109, కొత్తగూడెం ఏరియాలో 2,363, మణుగూరులో 2,321 మంది కార్మికులకు రూ.1,95,610 చొప్పున అందనున్నాయి. అయితే కార్మికులు 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో చేసినమస్టర్ల ఆధారంగా బోనస్ చెల్లిస్తారు.
రూ.8,289 అ‘ధనం’..
2024 – 25 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో కార్మికుడికి రూ.1,87,321 బోనస్ చెల్లించారు. ఈ ఏడాది రూ.8,289 చొప్పున పెంచగా ఒక్కో కార్మికుడికి రూ.1,95,610 చొప్పున అందనున్నాయి. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ ప్రకటించగా.. ఇల్లెందులో 350 మందికి, మనణుగూరులో 2 వేలు, కార్పొరేట్‌లో 1,500, కొత్తగూడెం ఏరియాలో 2,500 మొత్తం 6,350 మందికి రూ.5,500 చొప్పున చెల్లించనున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా ఒక్కో కాంట్రాక్ట్ కార్మికుడు రూ.5వేల చొప్పున బోనస్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక రెగ్యులర్ కార్మికులకు 1999 – 2000 ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా లాభాల వాటాను బోనస్‌గా ప్రకటించారు. అప్పుడు ఒక్కో కార్మికుడికి రూ.2వేల చొప్పున అందగా.. ప్రస్తుతం రూ.2లక్షలకు చేరువలో కార్మికులు బోనస్ అందుకుంటుండడం విశేషం.
సింగరేణి కార్మికులకు అందనున్న లాభాల బోనస్