
‘ఆదికర్మయోగి’పై గ్రామాల్లో అవగాహన
భద్రాచలం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అర్హులైన గిరిజనులకు నేరుగా అందించేందుకు చేపట్టిన ఆది కర్మయోగి అభియాన్ పథకం అమలు, కార్యాచరణపై సంబంధిత అధికారులకు శిక్షణ పూర్తయిందని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చిన మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫైర్స్ జోనల్ మేనేజర్ ప్రదీప్ కుమార్ సింగ్ సోమవారం పీఓను ఆయన చాంబర్‌లో కలిశారు. ఈ సందర్భంగా అభియాన్ పథకం కార్యక్రమ అమలు తీరు వివరాలను పీఓ ఆయనకు తెలిపారు. కలెక్టర్ సూచనల మేరకు డీఎంటీలకు ప్రత్యేక శిక్షణ అందించి గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై అవగాహన కల్పించామన్నారు. ప్రతి గ్రామానికి నోడల్ ఆఫీసర్‌ను నియమించి, పంచాయతీ సెక్రటరీ ఆధ్వర్యంలో గ్రామస్తులకు అవగాహన కలిగేలా ప్రచారం చేశామని చెప్పారు. ఆ తర్వాత ప్రదీప్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. మారుమూల గిరిజన గ్రామాల వారికి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ రకాల గుర్తింపుకార్డులు ఈ పథకం ద్వారా అందుతాయని చెప్పారు.
అర్హులకు సంక్షేమ పథకాలు అందాలి..
అర్హులైన ప్రతీ గిరిజనుడికి సంక్షేమ పథకాలు అందేలా అధికారులు, సిబ్బంది పని చేయాలని పీఓ రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆయన గిరిజనుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వాటిని సంబంధిత యూనిట్ అధికారులకు అందజేసి ఆన్‌లైన్‌లో నమోదు చేసి పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, డీడీ మణెమ్మ, గురుకుల ఆర్‌సీఓ అరుణకుమారి, ఈఈ సత్యానందం, ఏఓ సున్నం రాంబాబు, అధికారులు భాస్కర్, ఉదయ్‌కుమార్, రాజారావు, లక్ష్మీనారాయణ, వేణు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్ వెల్లడి