
బాలాత్రిపుర సుందరీ దేవిగా పెద్దమ్మతల్లి
వైభవంగా ప్రారంభమైన
శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
పాల్వంచరూరల్ : మండల పరిధిలో కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారు మొదటి రోజున శ్రీ బాలాత్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు గణపతి పూజ, పుణ్యావాచనం, రుత్వికరణ, దీక్షా వస్త్రధారణ, అఖండ దీపారాధన, గోపూజ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ రజినీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు దంపతులు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, మాజీ జెడ్పీటీసీ యర్రంశెట్టి ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
ఐదుగురు ఏఎంవీఐల నియామకం
కొత్తగూడెంటౌన్: జిల్లాకు కొత్తగా నియమితులైన అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ)లు సోమవారం జిల్లా ఇన్‌చార్జ్ ఆర్టీఓ వి.వెంకటరమణ సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. నూతనంగా నియమితులైన వారిలో రాజశేఖర్‌రెడ్డి, ఆశోక్, మానస, రాకేష్, శ్వేత ఉన్నారని, వీరిలో ఇద్దరు మహబూబాబాద్, ఇద్దరు మంచిర్యాల జిల్లాలకు, మరొకరు వరంగల్ జిల్లా వారని వెంకటరమణ తెలిపారు. ప్రతీ వాహనదారుడు తప్పకుండా పన్నులు చెల్లించాలని, లైసెన్స్, వాహనాలకు సంబంధించిన పత్రాలన్నీ సక్రమంగా ఉండాలని అన్నారు.
ఆరోగ్య సేవలపై
దృష్టి పెట్టాలి
డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి
చుంచుపల్లి: గర్భిణులు, శిశువుల ఆరోగ్య సేవలపై దృష్టి సారించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.జయలక్ష్మి అన్నారు. తమ కార్యాలయంలో సోమవారం సూపర్‌వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, హెల్త్ ఎక్స్‌టెన్షన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని, ఆపరేషన్లు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గర్భిణిని తప్పనిసరిగా నమోదు చేయాలని, హైరిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించాలని అన్నారు. ప్రతీ శిశువుకు పూర్తి స్థాయిలో టీకాలు వేయాలని, ఈ మేరకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో వైద్యాధికారులు పుల్లారెడ్డి, మహ్మద్ ఫైజ్ మొహియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

బాలాత్రిపుర సుందరీ దేవిగా పెద్దమ్మతల్లి

బాలాత్రిపుర సుందరీ దేవిగా పెద్దమ్మతల్లి