
ఆయిల్‌పామ్ రైతులకు అగచాట్లు !
● అధికారులకు ముందస్తు ప్రణాళిక లేదనే ఆరోపణలు ● బారులుదీరుతున్న గెలల ట్రాక్టర్లు ● రవాణాను అడ్డుకున్న రైతులు
అశ్వారావుపేట: ఆయిల్‌ఫెడ్ అధికారులు, పాలకులకు ముందస్తు ప్రణాళిక లేకనే అశ్వారావుపేట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ పరిధిలోని రైతులు నిత్యం ఇక్కట్ల పాలవుతున్నారు. 2005లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి.. గంటకు 5టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో అశ్వారావుపేటలో ఆయిల్‌పామ్ కర్మాగారాన్ని ప్రారంభించారు. దశల వారీగా సామర్థ్యాన్ని పెంచుతూ ప్రస్తుతం గంటకు 30 టన్నుల ప్రకారం రోజుకు సరాసరి గరిష్టంగా 500 టన్నుల సామర్థ్యంతో ఫ్యాక్టరీ నడుస్తోంది. కానీ అశ్వారావుపేట ఫ్యాక్టరీ పరిధిలో రోజుకు వెయ్యి టన్నుల గెలలు దిగుబడి వస్తుండడంతో అధికారులు గత మూడు రోజులుగా హార్వెస్టింగ్ హాలిడే ప్రకటించి సోమవారం నుంచి గెలలు తీసుకుంటున్నారు. మూడు రోజులు గెలలు నరకకపోవడం, నరికినా తోటల్లోనే ఉంచుకోవడంతో గెలల నుంచి గింజలు రాలిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఒకే రోజు ట్రాక్టర్లు భారీగా రావడంతో క్యూలో గంటల తరబడి వేచి ఉండలేక అచ్యుతాపురం గ్రామానికి చెందిన ఓ రైతు ఫ్యాక్టరీ గేటుకు ట్రాక్టర్‌ను అడ్డుగా నిలిపి ఆందోళనకు దిగారు. దమ్మపేట మండలం అప్పారావుపేట ఫ్యాక్టరీలో ఆలస్యం కాకుండా వెంటనే అన్‌లోడ్ చేసుకుంటారని, అశ్వారావుపేట ఫ్యాక్టరీలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రైతులను, ట్రాక్టర్ డ్రైవర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆ తర్వాత మేనేజర్ నాగబాబుతో వాగ్వాదానికి దిగారు. దీనికి మేనేజర్ స్పందిస్తూ అప్పారావుపేట ఫ్యాక్టరీ 90 టన్నుల సామర్థ్యంతో నడుస్తున్నందున ఎన్ని గెలలు వచ్చినా దిగుమతి చేసుకుంటారని, అశ్వారావుపేట ఫ్యాక్టరీ 30 టన్నుల సామర్థ్యంతో నడుస్తున్నందున రోజుకు 500 టన్నుల గెలులు మాత్రమే తీసుకోగలమని చెప్పారు. సోమవారం సాయంత్రానికి 350 టన్నుల గెలలు దిగుమతి చేసుకున్నామని, ఇంకా తీసుకునేందుకు కూడా సిద్ధంగానే ఉన్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
ఏటా ఇవే తిప్పలు..
వర్షం పడిందంటే చాలు ఫ్యాక్టరీ నుంచి జాతీయ రహదారి వరకు ఒక్కోసారి కిలోమీటర్ మేర గెలల ట్రాక్టర్లను క్యూలో నిలపాల్సి వస్తోంది. అశ్వారావుపేట పరిసరాల్లో ఆయిల్‌పామ్ తోటలను విస్తరిస్తున్న క్రమంలో గెలల దిగుబడికి అనుగుణంగా ఫ్యాక్టరీని ఆధునికీకరించలేదు. గంటకు 30 టన్నుల క్రషింగ్‌కు మించి విస్తరించడానికి 20 ఏళ్ల క్రితం నాటి పరిశ్రమ భాగాలు సహకరించవు. ఇప్పటికే అప్పుడప్పుడు ఆగుతూ సాగుతూ.. రోజుకు 500 టన్నుల గెలల క్రషింగ్ చేయడమే గొప్ప అని చెప్పొచ్చు. ఈ ఫ్యాక్టరీని అలాగే ఉంచి కొత్తగా 120 టన్నుల సామర్థ్యంతో మరో ఫ్యాక్టరీని నిర్మించడం తప్పితే వేరే ప్రత్యామ్నాయమే లేదని రైతులు అంటున్నారు. ఈ మేరకు ఆయిల్‌ఫెడ్ అధికారులు సైతం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ఎవరు మోకాలడ్డారో తెలియదు కానీ.. ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చకపోవడంతో రైతులకు అగచాట్లు తప్పడం లేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఆయిల్‌ఫెడ్‌లో ప్రాధాన్యతలు మారాయని రైతులు ఆరోపిస్తున్నారు. అశ్వారావుపేటలో నిర్మించాల్సిన రెండో ఫ్యాక్టరీని అప్పారావుపేటకు తరలించడం వెనుక ఉన్న శక్తులే అశ్వారావుపేటలో మూడో ఫ్యాక్టరీని కూడా అడ్డుకుంటున్నాయని అంటున్నారు. ప్రాంతీయ విబేధాలు, రాజకీయాలకు అతీతంగా అశ్వారావుపేటలో 120 టన్నుల సామర్థ్యంతో ఫ్యాక్టరీ నిర్మిస్తే సీజన్‌లో కొత్తదాంతో, అన్‌సీజన్‌లో పాత ఫ్యాక్టరీతో క్రషింగ్ చేయొచ్చని అభిప్రాయపడుతున్నారు.

ఆయిల్‌పామ్ రైతులకు అగచాట్లు !