సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక | - | Sakshi
Sakshi News home page

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక

Sep 23 2025 7:31 AM | Updated on Sep 23 2025 7:31 AM

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక

సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక

● బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలి ● కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

● బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలి ● కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

సూపర్‌బజార్‌(కొత్తగూడెం)/చుంచుపల్లి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలుస్తుందని, మహిళలకు ఎంతో ఇష్టమైన ఈ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించుకోవాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. సోమవారం డీఆర్‌డీఏ, సెర్ప్‌ ఆధ్వర్యంలో ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో ఆయన పాల్గొని మహిళా ఉద్యోగులతో ఆడిపాడారు. అనంతరం మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి ఆటా, పాటలతో గౌరమ్మను కొలుస్తారని చెప్పారు. ఈ పండుగను ఘనంగా నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రజలంతా ఆనందంగా ఉండేలా బతుకమ్మ దీవెనలు అందించాలని ఆకాంక్షించారు. అంతకుముందు అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగను జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతి పట్టణం, మండల కేంద్రం, గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకల కోసం తగిన ప్రదేశాలను గుర్తించి ముందుగానే లైటింగ్‌, సౌండ్‌ సిస్టమ్‌, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. మహిళలు, పిల్లలు అధికంగా పాల్గొంటారని, భద్రతా చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ విద్యాచందన, డీడబ్ల్యూఓ స్వర్ణలతా లెనీనా, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ జయలక్ష్మి, ఆయా శాఖల మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.

జీవాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలి..

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాలో మేకలు, గొర్రెల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. తమిళనాడు రాష్ట్రంలోని పాండిచ్చేరిలో శిక్షణ పొందిన వివిధ శాఖల అధికారులు తిరుపతయ్య, కార్తీక్‌, హేమంత్‌కుమార్‌తో సోమవారం ఆయన సమావేశమయ్యారు. శిక్షణలో నేరుకున్న అంశాలను వారు కలెక్టర్‌కు వివరించారు. పర్యావరణానికి హాని కలగకుండా స్థానికంగా లభించే మట్టిని వినియోగించి గ్రామాల్లో అవసరాలకు అనుగుణంగా భవన నిర్మాణాలు, ఉపాధి కూలీలకు అవకాశాలు కల్పించడం వంటి అంశాలు నేర్చుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత కలెక్టర్‌ మాట్లాడుతూ.. గ్రామాల్లో అంగన్‌వాడీ భవనాలు, ప్రహారీలు, పశువుల పాకలు, పౌల్ట్రీ షెడ్ల వంటి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. స్థానిక జాతి మేకల అభివృద్ధికి మేలుజాతి పోతులను ఎంపిక చేసి ఏదైనా గ్రామంలో ఐదు పోతులు పంపిణీ చేసేలా ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ వెంకటేశ్వర్లు, పశువైద్యులు ఆనంద్‌, సంతోష్‌, బాలకృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement