
నేడు అభయహస్త ధారిణిగా ఆదిలక్ష్మి
రామాలయంలో ప్రారంభం కానున్న
శరన్నవరాత్రి ఉత్సవాలు
భధ్రాచలం : రెండు చేతుల్లో పద్మాలు ధరించి వరద, అభయ హస్తాలతో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు తొలిరోజు ఆదిలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మంగళవారం నుంచి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చే అమ్మవారిని తొలిరోజు ఆదిలక్ష్మిగా అలంకరించనున్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు ఉపాలయం వద్ద ప్రత్యేక వేదిక సిద్ధం చేశారు. ఉదయం అమ్మవారికి అభిషేకం, సాయంత్రం సామూహిక కుంకుమార్చన, చిత్రకూట మండపంలో రామాయాణ పారాయణం జరపనున్నారు.
ముత్తంగి అలంకరణలో రామయ్య..
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.