
వీధి వ్యాపారులకు
● ఇటీవల బ్యాంకర్లు, మెప్మా అధికారులతో కలెక్టర్ సమావేశం ● మొదటి, రెండో విడత రుణాల మొత్తం పెంపు ● మూడో విడత రుణం చెల్లిస్తే క్రెడిట్ కార్డులు మంజూరు ● లోక కళ్యాణ్ మేళాలతో అవగాహన కల్పిస్తున్న మెప్మా అధికారులు
మళ్లీ రుణాలు..
కొత్తగూడెంఅర్బన్: పీఎం స్వనిధి పథకంలో వీధి వ్యాపారులకు ఇచ్చే రుణాలు గతేడాది నిలిచిపోయాయి. దీంతో కొత్తగూడెం కార్పొరేషన్‌తోపాటు జిల్లాలోని మున్సిపాలిటీల్లోని వీధి వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రుణాలు అప్ గ్రేడ్ చేయడం, నూతన సాఫ్ట్‌వేర్ డిజైన్ వల్ల రుణా ల మంజూరులో జాప్యం జరిగిందని మెప్మా అధి కారులు తెలిపారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం రుణాల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కలెక్టర్ ఆధ్వర్యంలో బ్యాంకర్లు, మెప్మా అధికారులతో గత శనివారం సమావేశం నిర్వహించారు. రుణాల మంజూరు గైడ్‌లైన్స్‌ను బ్యాంకర్లకు అందజేశారు. 2024 డిసెంబర్ 31 నుంచి నిలిపివేసిన రుణాలు మళ్లీ ఇచ్చే ప్రక్రియ ప్రారంభం కావడంతో వీధి వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే రుణ మొత్తం పెంచడంతో తమకు ఆసరా అవుతుందని పేర్కొంటున్నారు.
ఈసారి క్రెడిట్ కార్డు సైతం..
2020 నుంచి వీధి వ్యాపారులను గుర్తించి రుణాలు మంజూరు చేస్తున్నారు. మొదటి రుణంగా రూ.10 వేలు ఇచ్చి, వాయిదాల పద్ధతిలో అది తిరిగి చెల్లించాక రెండో రుణంగా రూ.20 వేలు, మూడో రుణంగా రూ.50 అందించేవారు. తాజాగా మొదటి రుణా న్ని రూ.15వేలు, రెండో రుణంగా రూ.25వేలు, మూడో రుణంగా రూ.50 వేలు ఇవ్వనున్నట్లు గైడ్‌లైన్స్‌లో పేర్కొన్నారు. మూడో రుణం తిరిగి చెల్లిస్తే క్రెడిట్ కార్డు కూడా ఇవ్వన్నారు. ప్రైవేటు మైక్రోఫైనాన్స్ నుంచి కాపాడేందుకు, తక్కువ వడ్డీతో రుణా లు పొంది ఆర్ధికాభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వీధి వ్యాపారులకు ఈ రుణాలు మంజూరు చేస్తున్నారు.
కొత్తగా గ్రూపుల ఏర్పాటు..
వీధి వ్యాపారులు కొత్తగూడెం కార్పొరేషన్‌లో 11,142 మంది, మణుగూరులో 2,028, ఇల్లెందులో 1,875 మంది ఉన్నారు. కొత్తగా ఏర్పడిన అశ్వారావుపేట మున్సిపాలిటీలో వీధి వ్యాపారులను గుర్తించాల్సి ఉంది. ఇప్పటివరకు మహిళలను గ్రూప్‌గా ఏర్పాటు చేసి రుణాలు మంజూరు చేసేలా మెప్పా అధికారులు కృషి చేస్తున్నారు. ఇక నుంచి వీధివ్యాపారులతో కూడా గ్రూప్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొదటగా ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది సభ్యులతో గ్రూప్‌లు ఏర్పాటు చేయనున్నారు.
మెప్మా ఆధ్వర్యంలో లోక కళ్యాణ్ మేళా
రుణాల ప్రక్రియ తిరిగి ప్రారంభమైన విషయంపై అవగాహన కల్పించేందుకు మెప్మా ఆధ్వర్యంలో లోక కళ్యాణ్ మేళాలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగనుండగా, రుణ స్థాయి పెంపు, ఇతర మార్గదర్శకాలను మెప్మా అధి కారులు వివరిస్తున్నారు. గతంలో రుణం తీసుకుని పూర్తిగా చెల్లించినవారు బ్యాంక్ స్టేట్‌మెంట్ తీసుకుని సమీపంలోని మెప్మా కార్యాలయానికి వెళ్తే ప్రొసిడింగ్స్ ఇస్తారు. అవి తీసుకుని మళ్లీ బ్యాంక్‌లో అందజేస్తే రుణం మంజూరువుతుంది. కార్పొరేషన్‌తోపాటు మణుగూరు, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో, బ్యాంకులలో మేళాలు నిర్వహిస్తున్నట్లు మెప్మా అధికారులు చెబుతున్నారు. ఈ సారి ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి వీధి వ్యాపారులకు సర్టిఫికెట్లను ఉచితంగా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం రుణల మంజూరుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా, కలెక్టర్ సమావేశం నిర్వహించి గైడ్‌లైన్స్ అందించినా బ్యాంకర్లు ఆంక్షలు పెడుతున్నారని వీధి వ్యాపారులు పేర్కొంటున్నారు. రుణంకోసం బ్యాంకులకు వెళ్తే ప్రక్రియ ఇప్పుడే ప్రారంభమైందని, అప్పుడే రుణాలు రావని, ఫోన్ చేసి సమాచారం ఇస్తామంటూ బ్యాంక్ అధికారులు జాప్యం చేస్తున్నారని వాపోతున్నారు.